దసపల్లా భూములు ప్రైవేట్ వ్యవహారం.. నాకు సంబంధం లేదు

ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ భూమికి సంబంధించిన వ్యవహారమంటున్నారు విజయసాయిరెడ్డి. ప్రైవేట్ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల దసపల్లా భూములు కొందరు ప్రైవేట్ వ్యక్తులకు దక్కాయని.. ఇప్పుడు వాటిని ఏం చేసుకుంటారన్నది ఆ ప్రైవేట్ వ్యక్తుల ఇష్టమన్నారు.

Advertisement
Update: 2022-10-04 05:32 GMT

ప్రభుత్వానికి చెందిన రెండు వేల కోట్ల రూపాయల విలువైన విశాఖ దసపల్లా భూములను విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడు చేజెక్కించుకుంటున్నారంటూ వారం రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. దసపల్లా భూముల్లో 82 ఎకరాలకు సంబంధించి టీడీపీ హయాంలోనే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. ఆ భూములు ప్రభుత్వానికి కావు.. రాణి కమలాదేవికే చెందుతాయని న్యాయస్థానం వెల్లడించిందని.. తీర్పును అమలు చేయకపోతే ధిక్కరణ చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిందని.. దాంతో ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు.

దసపల్లా భూములను 22ఏ జాబితా నుంచి తొలగిస్తే 40 ఎకరాల పరిధిలో ఉంటున్న 500 మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. అందులో 64 మంది ప్లాట్ల యజమానులు మాత్రమే తమ పరిధిలో ఉన్న 20 శాతం భూమిని అస్యూర్ డెవలపర్స్‌కు అప్పగించారని విజయసాయిరెడ్డి వివరించారు.( ఈ అస్యూర్ కంపెనీ విజయసాయిరెడ్డి బినామీ కంపెనీగా టీడీపీ ఆరోపిస్తోంది). ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ భూమికి సంబంధించిన వ్యవహారమంటున్నారు విజయసాయిరెడ్డి. ప్రైవేట్ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల దసపల్లా భూములు కొందరు ప్రైవేట్ వ్యక్తులకు దక్కాయని.. ఇప్పుడు వాటిని ఏం చేసుకుంటారన్నది ఆ ప్రైవేట్ వ్యక్తుల ఇష్టమన్నారు.

ఈ దసపల్లా భూములను ఇది వరకు కొనుగోలు చేసిన వారి నుంచి .. వాటిని తన అల్లుడు, కుమార్తె, మరో ఇద్దరు బినామీల పేరిట ఏర్పాటు చేసిన కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేయించారని మీడియా, ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. రిజిస్ట్రేషన్‌కు స్టాంప్ డ్యూటీకి కింద చెల్లించాల్సిన 9.75 కోట్ల రూపాయలను విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడి పేరిట ఉన్న కంపెనీ నుంచే చెల్లించడాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. భూములు ఇలా రిజిస్ట్రేషన్ ద్వారా తన కుటుంబ సభ్యుల కంపెనీల చేతికి వచ్చిన తర్వాత ఈ భూములను 22ఏ నిషిద్ధ జాబితా నుంచి తొలగించారని ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలను ఇప్పుడు విజయసాయిరెడ్డి ఖండిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News