వలంటీర్ వ్యవస్థ.. వరల్డ్‌లోనే బెస్ట్‌.. టీడీపీ నేతల యూటర్న్‌

పార్టీ అధినేత చంద్రబాబు నుంచి కింది స్థాయి నేతల వరకు వలంటీర్లను పరోక్షంగా దువ్వే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement
Update: 2024-04-11 07:34 GMT

ఏపీ రాజకీయాలు ఇప్పుడు అంతా వలంటీర్ల చుట్టూనే తిరుగుతున్నాయి. తెలుగుదేశం మద్ధతుదారుల ఫిర్యాదుతో ఏపీలో వలంటీర్ల సేవలను ఎన్నికల సంఘం నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో చాలా చోట్ల వలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తూ వైసీపీకి మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో తత్వం బోధపడిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు నాలుకను మడతపెట్టేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి కింది స్థాయి నేతల వరకు వలంటీర్లను పరోక్షంగా దువ్వే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి సైతం వలంటీర్ వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. జగన్‌ వచ్చాక విలేజ్‌లలో అనేక బిల్డింగ్‌లు కట్టించారని..వాటిని తొలగించలేం కదా..అదే విధంగా వలంటీర్‌ వ్యవస్థను తొలగించబోమని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే వలంటీర్లకు తెలుగుదేశం అండగా ఉంటుందని చెప్పారు. 50 ఇళ్లకు ఒక వలంటీర్..ప్రపంచంలోనే గొప్ప వ్యవస్థ అంటూ ప్రశంసలు కురిపించారు జేసీ. వలంటీర్ల సహకారంతో మంచి పరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు జేసీ.


గతంలో వలంటీర్లపై అనేక విమర్శలు చేసిన చంద్రబాబు సైతం ఇటీవల యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. కూటమి అధికారంలోకి వస్తే వలంటీర్ల జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించారు. గతంలో వలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ సైతం ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్న విషయం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News