అధికారులూ సిద్ధం కండి.. విశాఖలో ఆఫీస్ లు రెడీ

విశాఖకు వచ్చే అధికారులకు పరిపాలన భవనాలను మాత్రమే త్రిసభ్య కమిటీ పరిశీలిస్తోంది. వసతి సౌకర్యాలను మాత్రం ఆయా శాఖలే చూసుకోవాలని కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Update: 2023-10-18 03:19 GMT

విశాఖ ముహూర్తాన్ని డిసెంబర్ కి మార్చినా పనులు మాత్రం చకచకా జరుగుతున్నాయి. త్రిసభ్య కమిటీ విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలకోసం వెదుకులాట ప్రారంభించింది. దీనికోసం వివిధ భవనాలను నేరుగా అధికారులు పరిశీలించారు. జిల్లా అధికారుల నుంచి మరింత సమాచారం సేకరించారు. సీఎం జగన్ విశాఖకు వచ్చేలోగా అధికారులంతా షిఫ్ట్ కావాలనేది ప్రభుత్వ ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మిలీనియం టవర్స్..

విశాఖలో ఐటీ ఆఫీస్ ల కోసం నిర్మించిన మిలీనియం టవర్స్ లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక టవర్-బి నిర్మాణం మొదలైంది. మిలీనియం టవర్స్‌ లో అందుబాటులో ఉన్న 2 లక్షల చదరపు అడుగుల భవనాలను త్రిసభ్య కమిటీ పరిశీలించింది. ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ఈ మిలీనియం టవర్స్ సానుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. మిలీనియం టవర్స్‌ తో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను పరిశీలించారు అధికారులు.

పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయం అక్కడే..

గ్రే హౌండ్స్‌ విభాగానికి చెందిన భవనాల్లో.. పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అధారిటీకి చెందిన భవనాల్లో మున్సిపల్ శాఖ ను షిఫ్ట్ చేస్తారు. అరిలోవలో ఉన్న విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు వైద్యారోగ్యశాఖను తరలిస్తారని అంటున్నారు. విశాఖకు వచ్చే అధికారులకు పరిపాలన భవనాలను మాత్రమే త్రిసభ్య కమిటీ పరిశీలిస్తోంది. వసతి సౌకర్యాలను మాత్రం ఆయా శాఖలే చూసుకోవాలని కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News