నో జాయింట్ మీటింగ్స్

రెండుపార్టీల మధ్య పొత్తు వ్యవహారం ఎలాగుందంటే కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకున్నట్లుంది.

Advertisement
Update: 2024-01-31 05:42 GMT

క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఫిబ్రవరి మొదటివారం నుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర టూర్ మొదలవుతోంది. ఫిబ్రవరి మొదటివారం నుండి రోజుకు మూడు నియోజకవర్గాల్లో పవన్ పాల్గొంటారని పార్టీ ప్రకటించింది. అయితే షెడ్యూల్ మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. రాష్ట్ర పర్యటనకు, బహిరంగసభల నిర్వహణకు రూట్ మ్యాప్ రెడీ అయిపోయిందని మాత్రమే ప్రకటించింది. షెడ్యూల్ మొత్తంలో ప్రతి మీటింగులోనూ పవన్ పాల్గొంటారని మాత్రమే ఉంది కానీ, చంద్రబాబునాయుడు కూడా పాల్గొంటారని ఎక్కడా లేదు.

ఇప్పటికే రా..కదలిరా సభల్లో చంద్రబాబు మాత్రమే పాల్గొంటున్న విషయం అందరూ చూస్తున్నదే. ఇప్పటికి 14 సభల్లో చంద్రబాబు పాల్గొన్నా ఎక్కడా పవన్ కనిపించలేదు. గతంలో చంద్రబాబు, పవన్ జాయింట్ మీటింగులుంటాయని రెండుపార్టీల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రకటన ప్రకటనగానే మిగిలిపోయింది. లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభలో పాల్గొనేట్లు పవన్ను అతికష్టంమీద చంద్రబాబు ఒప్పించిన విషయం గుర్తుండే ఉంటుంది. రెండుపార్టీల మధ్య పొత్తు వ్యవహారం ఎలాగుందంటే కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకున్నట్లుంది.

అధినేతల వ్యవహార శైలి ఎవరికి వారే అన్నట్లుగా సాగుతోంది. పైగా ఇగో ప్రాబ్లెమ్స్ కూడా బాగా పెరిగిపోతున్నట్లు అర్థ‌మవుతోంది. మండపేట, అరకు నియోజకవర్గాలకు చంద్రబాబు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. అందుకనే రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తుందని పవన్ ప్రకటించారు. ఈ ప్రకటనలతో రెండుపార్టీల్లోనూ గందరగోళం పెరిగిపోయింది. ఇంత గందరగోళం జరుగుతున్నా పట్టించుకోకుండా చంద్రబాబు నూజివీడులో కొలుసు పార్ధసారధి పోటీచేస్తారని మూడో నియోజకవర్గాన్ని ప్రకటించారు.

దాంతో జనసేన నేతలకు బాగా మండిపోయింది. చంద్రబాబు మూడో నియోజకవర్గం ప్రకటనపై పవన్ రియాక్షన్ ఏమిటన్నది ఇంకా తెలీలేదు. అయితే సడెన్ గా పవన్ రాష్ట్ర పర్యటనను పార్టీ ప్రకటించింది. ఆ ప్రకటనలో ఎక్కడా చంద్రబాబు ప్రస్తావన లేకుండా జాగ్రత్తపడింది. బహిరంగసభలు సక్సెస్ కావటానికి పార్టీ తరపున మాత్రమే జోనల్ కమిటీలను నియమించారు. ఇందులో కూడా ఎక్కడా టీడీపీ నేతల ప్రస్తావనలేదు. కాబట్టి చంద్రబాబు, పవన్ జాయింట్ మీటింగ్స్ ఇప్పట్లో ఉండవనే క్లారిటీ వచ్చేసింది.

Tags:    
Advertisement

Similar News