ఏపీలో టీడీపీ హౌస్ అరెస్ట్

చంద్రబాబుని ఈరోజు కోర్టులో హాజరు పరిచే అవకాశముంది. ఆయన్ను విజయవాడ సీఐడీ ఆఫీస్ కి తరలించి అక్కడినుంచి ఇదే రోజు కోర్టుకి తీసుకెళ్తారని అంటున్నారు.

Advertisement
Update: 2023-09-09 04:51 GMT

చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలను ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. నేతల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరినీ ఇళ్లలోనుంచి బయటకు రానీయడంలేదు. రోడ్లపై కూడా పోలీసులు సెక్యూరిటీ పెంచారు. నిరసనల పేరుతో నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి హడావిడి చేయకుండా అడ్డుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో చోటా నాయకుల్ని పోలీసులు స్టేషన్లకి తరలించారు.

ఆర్టీసీ అలర్ట్..

మరోవైపు ఆర్టీసీ బస్సుల విషయంలో కూడా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల బస్సులను డిపోలనుంచి బయటకు తీయడంలేదు. పరిమితంగానే ఈరోజు ఆర్టీసీ సర్వీసులను నడుపుతోంది. అల్లర్లలో ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్టులు రావడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తిరిగే అన్ని బస్సులు నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో తిరిగే సిటీ బస్సులు కూడా రోడ్డెక్కలేదు.

రోడ్లన్నీ ఖాళీగా..

ఈరోజు రెండో శనివారం కావడంతో విద్యాసంస్థలకు కూడా సెలవు. ప్రభుత్వ ఆఫీసులు, బ్యాంకులు కూడా లేవు. దీంతో సహజంగానే రోడ్లు, కూడళ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. బస్సుల్ని కూడా ఆపేయడం, పోలీసు బందోబస్తు పెంచడంతో ఏపీలో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.

ఈరోజు కోర్టుకి బాబు..

చంద్రబాబుని ఈరోజు కోర్టులో హాజరు పరిచే అవకాశముంది. ఆయన్ను విజయవాడ సీఐడీ ఆఫీస్ కి తరలించి అక్కడినుంచి ఇదే రోజు కోర్టుకి తీసుకెళ్తారని అంటున్నారు. కేసు వివరాలని సీఐడీ డీజీ ప్రెస్ మీట్ లో వివరిస్తారు.

Tags:    
Advertisement

Similar News