తమ్ముళ్ళ గొంతులు లేస్తున్నాయా?

ఒక్కో నియోజకవర్గంలో సమస్యలు బయటపడుతున్నాయి. తమ్ముళ్ళ గొంతులు మెల్లిగా పైకి లేస్తున్నాయి. మరి ఎన్నికల నాటికి ఇంకెన్ని గొంతులు పైకి లేస్తాయో తెలియ‌దు.

Advertisement
Update: 2023-06-04 05:09 GMT

చంద్రబాబు నాయుడు నిర్ణయాలపై తమ్ముళ్ళ గొంతులు మెల్లిగా పైకి లేస్తున్నాయి. ఎందుకు లేస్తున్నాయంటే తమ సీట్లకే ఎసరొచ్చేట్లున్నాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి కాబట్టే. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన కామెంట్లే తాజా నిదర్శనం. భాష్యం ప్రవీణ్ అనే వ్యక్తి నియోజకవర్గంలో బాగా యాక్టివ్‌గా ఉన్నారు. దాంతో రేపటి ఎన్నికల్లో తనకు టికెట్ ఎక్కడ ఎగిరిపోతుందో అని ప్రత్తిపాటి మండిపోతున్నారు. అందుకనే ఫౌండేషన్లు, ట్రస్టుల పేరుతో కాస్త హడావుడి చేస్తే టికెట్లిచ్చేస్తారా అని చంద్రబాబునే నిలదీశారు.

ఇక ఆళ్ళగడ్డ, నంద్యాలలో అయితే మరో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా గోల చేస్తున్నారు. తనకు కాదని ఆళ్ళగడ్డలో ఎవరికైనా టికెట్ ఎలా ఇస్తారంటు గట్టిగానే అడుగుతున్నారు. అయితే అఖిల ట్రాక్ రికార్డు కూడా పరమ చెత్తగా ఉంది కాబట్టి ఆమెకు పార్టీలో మద్దతులేదు. ఇక పాణ్యంలో తనకు కాకుండా చంద్రబాబు ఎవరికి టికెట్ ఇస్తారో చూస్తానని కేఈ ప్రతాప్ సవాలు చేశారు. అందుకే చంద్రబాబు నియమించిన ఇన్‌చార్జిని పనిచేయనీయటంలేదు.

ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం అందరికీ తెలిసిందే. చంద్రబాబును ఎంపీ ఈకముక్కలాగ తీసిపారేస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డికి టికెట్ ఇస్తే తాము పనిచేయమని డైరెక్టుగా తమ్ముళ్ళు చంద్రబాబుకే చెప్పేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు మూడోసారి టికెట్ ప్రకటించారు. దాన్ని బొడ్డు రమణరావు, గుణ్ణం చంద్రమౌళి బహిరంగంగానే వ్యతిరేకించారు.

తమిద్దరిలో ఎవరికో ఒక‌రికి టికెట్ దక్కాలని లేకపోతే చిన్నరాజప్పను ఓడిస్తామని బహిరంగంగానే హెచ్చరించటం పార్టీలో కలకలం సృష్టించింది. ఇక విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేటలో మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు టికెట్ ఇస్తే ఓడగొడతామని నేతలంతా మూకుమ్మడిగా పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. ఈ విధంగా ఒక్కో నియోజకవర్గంలో సమస్యలు బయటపడుతున్నాయి. తమ్ముళ్ళ గొంతులు మెల్లిగా పైకి లేస్తున్నాయి. మరి ఎన్నికలనాటికి ఇంకెన్ని గొంతులు పైకి లేస్తాయో తెలియ‌దు.

Tags:    
Advertisement

Similar News