15 కేసులు పెట్టారు, 7సార్లు జైలుకి తీసుకెళ్లారు.. ఇదీ నా ట్రాక్ రికార్డ్..

గతంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని తనకు ఇప్పుడు స్టేషన్ అత్తారిల్లుగా మారిపోయిందని అన్నారు నారా లోకేష్. తనపై 15 కేసులు పెట్టారని, ఏడు సార్లు జైలుకు తీసుకెళ్లారని మండిపడ్డారు.

Advertisement
Update: 2022-09-08 13:21 GMT

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, అయినా తాము భయపడేది లేదన్నారు నారా లోకేష్. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక చూస్తూ ఊరుకునేది లేదని, బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా చినరావూరులో ఇటీవల మృతిచెందిన పాటిబండ్ల నరేంద్రనాథ్‌ కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు లోకేష్.

పోలీస్ స్టేషన్ నా అత్తారిల్లు..

గతంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని తనకు ఇప్పుడు స్టేషన్ అత్తారిల్లుగా మారిపోయిందని అన్నారు లోకేష్. తనపై 15 కేసులు పెట్టారని, ఏడు సార్లు జైలుకు తీసుకెళ్లారని, అయినా భయపడేది లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అన్నం పెట్టే సంగతి అటుంచి అన్న క్యాంటీన్లు పెట్టినవారిని కొడుతోందని మండిపడ్డారు లోకేష్. మంగళగిరి, కుప్పం, తెనాలిలో అన్న క్యాంటీన్లను ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారు. ప్రభుత్వం ప్రజల్ని ఎందుకిలా భయపడుతోందని ప్రశ్నించారు లోకేష్.

అప్పుడే ట్రోలింగ్ మొదలు..

నారా లోకేష్ ఎప్పుడు ప్రసంగించినా వెంటనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలవుతుంది. తాజాగా ఆయన రాజారెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి ట్రోలింగ్ కి గురయ్యారు. తెనాలి పర్యటనలో నారా లోకేష్, రాజారెడ్డి గురించి ప్రస్తావించారు. వైఎస్ జగన్ తాత రాజారెడ్డికే తాము భయపడలేదని, ఇక జగన్ కి తామెందుకు భయపడతామని అన్నారు లోకేష్. అసలు రాజారెడ్డి, లోకేష్ ని ఎందుకు భయపెట్టారని, ఆయనకు, ఈయనకు సంబంధం ఎక్కడుందని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. రాజారెడ్డి ప్రస్తావన తెచ్చిన లోకేష్.. అనుకోకుండా ట్రోలింగ్ కి గురయ్యారు.

Tags:    
Advertisement

Similar News