కొట్టుకోటానికే సమావేశమవుతున్నారా?

అమలాపురం, పిఠాపురం, అనకాపల్లి, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెడన సమావేశాల్లో ఒక‌రిపై మ‌రొక‌రు దాడులు చేసి కొట్టుకున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఆధిపత్య గొడవలే.

Advertisement
Update: 2023-11-19 06:05 GMT

ఎక్కడైనా రెండు వ్యతిరేక గ్రూపులు లేదా ఇద్దరు ప్రత్యర్థులు సమావేశమవుతున్నారంటే వాళ్ళ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాటానికే. అలాకాకుండా సమావేశమైన తర్వాత కూడా మళ్ళీ గొడవలు పడితే ఇక సమావేశానికి అర్థ‌మే ఉండదు. ఇప్పుడు రెండు పార్టీల నేతల మధ్య జరుగుతున్నది ఇదే. విషయం ఏమిటంటే టీడీపీ-జనసేన నేతల మధ్య సమన్వయ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల నేతలు ఎందుకు సమావేశం అవతున్నారంటే గొడవలు పడటానికే అన్నట్లుగా ఉంది.

తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి.. అన్నట్లుగా ఉంది చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యవహారం. అసలే జనసేన అంటే టీడీపీకి చాలా చిన్నచూపుంది. జనసేన నేతలను టీడీపీ సీనియర్ నేతల్లో చాలామంది అసలు లెక్కకూడా చేయరు. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు వివిధ సందర్భాల్లో రుజువైంది. ఈ విషయం ఆ పార్టీల‌ అధినేతలకు బాగా తెలుసు. అయినా సరే తాము పొత్తుపెట్టుకోవాలని అనుకున్నాం కాబట్టి రెండు పార్టీల నేతలు కలిసుండాల్సిందే అని చెప్పేశారు.

పై స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే నియోజకవర్గాల్లో రెండు పార్టీల నేతల మీటింగులు మొదలయ్యాయి. ఇప్పటికి సుమారు 10 నియోజకవర్గాల్లో ఉమ్మడి సమావేశాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆరు నియోజకవర్గాల సమావేశాల్లో రెండు పార్టీల నేతలు కొట్టేసుకున్నారు. అమలాపురం, పిఠాపురం, అనకాపల్లి, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెడన సమావేశాల్లో ఒక‌రిపై మ‌రొక‌రు దాడులు చేసి కొట్టుకున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఆధిపత్య గొడవలే. తాము పోటీ చేయాలని అనుకుంటున్న నియోజకవర్గంలో ఎదుటి పార్టీ టికెట్ తన్నుకుపోతుందేమో అనే ఆందోళనతోనే గొడవలు జరిగాయి.

టికెట్ల విషయంలో రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని చంద్రబాబు, పవన్ ఇద్దరికీ బాగా తెలుసు. అయినా సరే తాము కలిసిపోయాము కాబట్టి కిందస్థాయిలో కూడా నేతలంతా కలిసిపోయి పనిచేయాల్సిందే అని డిసైడ్ చేశారు. అయితే చంద్రబాబు, పవన్ చేతులు కలిపారంటే వాళ్ళకు చాలా భయాలున్నాయి. కానీ కిందస్థాయిలో నేతలు చేతులు కలపటానికి కారణాలు లేవు. పైగా టికెట్ చేజారుతుందేమో అనే భయముంది. దీనికి అదనంగా సమావేశమైన రెండుపార్టీల నేతలు ఒక‌రినొక‌రు ఎత్తిపొడుపు మాటలతో చులకనగా, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. దాంతో మాటమాటపెరిగి గొడవలు మొదలై కొట్టుకుంటున్నారు. కొట్టుకోవటానికైతే అసలు సమావేశాలు పెట్టుకోవటం ఎందుకో అర్థంకావటంలేదు.


Tags:    
Advertisement

Similar News