దేనికైనా రెడీనా?

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారో ఏపీలో పవన్ సేమ్ టు సేమ్ అలాగే వ్యవహరిస్తున్నారు. సోమవారం నుండి రాజోలులో లోకేష్ పునఃప్రారంభించబోతున్న యువగళం పాదయాత్రలో జనసేన నేతలు కూడా పాల్గొనేందుకు రెడీ అయిపోయారు.

Advertisement
Update: 2023-11-27 05:47 GMT

అధికారంలోకి రావటమే ముఖ్యం.. అందుకోసం దేనికైనా రెడీ అనే పార్టీలున్నాయి. ఇలాంటి పార్టీల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి టీడీపీ, జనసేన. అధికారం అందుకోవటమే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ టార్గెట్. అందుకోసం సిద్ధాంతాలు, నైతికత ఏమీ పట్టించుకోరు. ఇప్ప‌డిదంతా ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారో ఏపీలో పవన్ సేమ్ టు సేమ్ అలాగే వ్యవహరిస్తున్నారు. సోమవారం నుండి రాజోలులో లోకేష్ పునఃప్రారంభించబోతున్న యువగళం పాదయాత్రలో జనసేన నేతలు కూడా పాల్గొనేందుకు రెడీ అయిపోయారు.

పార్టీ సీనియర్ నాయ‌కుడు బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్రలో జనసేన నేతలు, క్యాడర్ కూడా పాల్గొంటారని ప్రకటించారు. నిజానికి టీడీపీ, జనసేన మిత్రపక్షాలు కావు. జనసేనకు మిత్రపక్షం బీజేపీ మాత్రమే. ఎన్డీయేలో జనసేన పార్టనర్‌గా ఉంటు టీడీపీతో చేతులు కలపటం పూర్తిగా అనైతికమే. జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపటం కోసమే చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారు.

వేదికల మీద నుండి నీతులు, సిద్ధాంతాలు చెప్పే పవన్ ఆచరణలో మాత్రం పూర్తి రివర్సులో నడుస్తుంటారు. తన వైఖరికి టీడీపీతో చేతులు కలపటమే నిదర్శనం. కైకలూరు వారాహి యాత్రలో ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసినట్లు ప్రకటించిన పవన్ 24 గంటలు గడవకుండానే మాట మార్చారు. తాను ఎన్డీయేలోనే ఉన్నట్లు చెప్పుకున్నారు. మరి 24 గంటల్లో ఏమైందో తెలియ‌దు కానీ మాట మార్చేశారు. పవన్ వైఖరి వ్యక్తిగతంగా బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి హ్యాపీగానే ఉండచ్చు. పార్టీకంటూ ఉన్నది ఏమీలేదు కాబట్టి పోయేది కూడా ఏమీ లేదన్నదే పురందేశ్వరి ఆలోచనగా ఉంది.

ఇక తెలంగాణ వ్యవహారం చూస్తే కాంగ్రెస్ గెలుపున‌కు టీడీపీ యథాశక్తి సహకరిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంలో టీడీపీ నేతలు, క్యాడర్ రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటున్నారు. నిజానికి రెండు పార్టీలు మిత్రపక్షాలు కావు. కేవలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడన్న ఏకైక కారణంతోనే టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుని మరీ సాయం చేస్తోంది. చంద్రబాబు, పవన్ వైఖరి చూస్తుంటే దేనికైనా రెడీ అని అర్థ‌మైపోతోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News