బీజేపీతో పొత్తు.. ముస్లింల ఓట్ల కోసం బాబు విశ్వ‌ప్ర‌య‌త్నాలు

‘బీజేపీతో నేను పొత్తు కోసం వెళ్లలేదు. వాళ్లు వస్తేనే పొత్తు పెట్టుకున్నా..’ అంటూ అబద్ధాలు వల్లెవేయడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది.

Advertisement
Update: 2024-03-27 05:10 GMT

ప్రస్తుత ఎన్నికలు చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేశ్‌కి చావోరేవో అన్న పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా గెలుపొందాలని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే బీజేపీతో పొత్తు కోసం వారితో కాళ్ల బేరం వరకూ వెళ్లారు. ఢిల్లీలో బీజేపీ కరుణ కోసం ఎదురుచూపులు చూడటం.. ఆ పార్టీ అగ్రనేతల పిలుపు కోసం రోజుల తరబడి వేచి చూడటం.. రాష్ట్రంలో ఏమాత్రం బలం లేని బీజేపీకి డిమాండ్‌ చేసినన్ని సీట్లు సమర్పించుకోవడం.. ఇవన్నీ దేశమంతా గమనిస్తూనే ఉంది. మొత్తంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు చంద్రబాబు దారుణంగా దిగజారిపోయి ఆ పార్టీ అగ్రనేతల ముందు పాదాక్రాంతమయ్యారనే విషయం అందరికీ అర్థమైంది.

బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న ఎపిసోడ్‌ తనకు నష్టం చేస్తుందని.. రానున్న ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు తనకు దూరమవుతారని భయపడుతున్న చంద్రబాబు ఇప్పుడు వారిని నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం బాబు అలవోకగా అబద్ధాలు చెప్పే తన టాలెంట్‌ను మరోసారి బయటికి తీశారు. మంగళవారం తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ముస్లింలతో జరిగిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ‘బీజేపీతో నేను పొత్తు కోసం వెళ్లలేదు. వాళ్లు వస్తేనే పొత్తు పెట్టుకున్నా..’ అంటూ అబద్ధాలు వల్లెవేయడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది.

బాబు తాజా వ్యాఖ్యలు ఆయన చిత్తశుద్ధి లేని రాజకీయాలకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకొన్నారు. ఆ తర్వాత విడిపోయి, కాంగ్రెస్‌ వెంట తిరిగారు. ఇప్పుడు మళ్లీ రాజకీయ అవసరాల కోసం బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడారు. ఈ విషయం కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన తర్వాత కూడా బాబు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంపై జనం మండిపడుతున్నారు. మాటలు మార్చడంలో.. అబద్ధాలు చెప్పడంలో బాబు దిట్ట అని.. ఇందుకు ఆయన ఏమాత్రం సిగ్గుపడరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News