పరిపూర్ణానంద మరో మెలిక.. కూటమికి హెచ్చరిక

హిందూపురం అసెంబ్లీకి ఈనెల 21న, పార్లమెంట్ స్థానానికి ఈనెల 25న నామినేషన్ వేస్తానని తేల్చి చెప్పారు పరిపూర్ణానంద.

Advertisement
Update: 2024-04-19 03:41 GMT

ఏపీలో టీడీపీ కూటమికి ఒక్కో ప్రాంతంలో ఒక్కొకరు షాకులిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గ పరిధిలో స్వామి పరిపూర్ణానంద, కూటమికి కంట్లో నలుసులా మారారు. ఆయన్ను తీసిపారేయలేరు, అలాగని బుజ్జగించే ప్రయత్నమూ ఎవరూ చేయలేదు. దీంతో తనను అసలు పట్టించుకోవడంలేదంటూ మరోసారి తెరపైకి వచ్చారు పరిపూర్ణానంద. నామినేన్ల పర్వం మొదలవడంతో.. హిందూపురం అసెంబ్లీకి ఈనెల 21న, పార్లమెంట్ స్థానానికి ఈనెల 25న నామినేషన్ వేస్తానని తేల్చి చెప్పారు.

కండిషన్స్ అప్లై..

హిందూపురం అసెంబ్లీ లేదా పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరపున టికెట్ ఆశించి భంగపడిన పరిపూర్ణానంద.. తనకు సీటివ్వకపోతే రెబల్ గా బరిలో దిగుతానని హెచ్చరించారు. అన్నట్టుగానే ఆయన ఇప్పుడు నామినేషన్ వేయడానికి రెడీ అయ్యారు. అయితే తనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు.. ఓ హామీ ఇస్తే చాలని కొత్త మెలిక పెట్టారు పరిపూర్ణానంద. అలా చేస్తేనే తాను నామినేషన్లు ఉపసంహరించుకుంటానంటున్నారు.

అభివృద్ధి హామీ కావాలట..

గత 75 సంవత్సరాలుగా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని ఆరోపిస్తున్నారు పరిపూర్ణానంద. కేంద్ర పెద్దల నుండి హిందూపూర్ అభివృద్ధిపై స్పష్టమైన హామీ వస్తే తాను బరిలో దిగనని తేల్చి చెప్పారు. టికెట్లు కేటాయించే సమయంలో కనీసం తనకు ఓ మాటకూడా చెప్పలేదనేది ఆయన ఆవేదన. మొత్తానికి హిందూపూర్ పార్లమెంట్ ని అభివృద్ధి చేస్తామంటూ కేంద్రంలోని పెద్దలు తనకు హామీ ఇవ్వాలంటున్నారు పరిపూర్ణానంద. అయితే ఈ అభివృద్ధి వ్యవహారం ఎన్నికలప్పుడే ఆయనకు గుర్తు రావడం విశేషం. గతంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన ఎలాంటి కృషి చేశారనేది మాత్రం ఎవరికీ తెలియదు. బీజేపీ టికెట్ రాకపోవడంతో, రెబల్ బెదిరింపులు కూడా పూర్తి స్థాయిలో ఫలించకపోవడంతో.. అభివృద్ధి హామీ అంటూ సరికొత్త ఎత్తు వేశారు పరిపూర్ణానంద. 

Tags:    
Advertisement

Similar News