థర్టీ ఇయర్స్ పృథ్వీకి కోర్టులో షాక్..

పృథ్వీరాజ్.. సీరియల్స్, సినిమాల ద్వారా నెలకి 30లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని, తన కుటుంబానికి న్యాయం చేయాలని భార్య కోర్టుకి విన్నవించింది.

Advertisement
Update: 2022-10-01 02:44 GMT

సినీనటుడు, మాజీ వైసీపీ, ప్రస్తుత జనసేన నేత బాలిరెడ్డి పృథ్వీరాజ్ (థర్టీ ఇయర్స్ పృథ్వీ)కి విజయవాడ ఫ్యామిలీ కోర్టు లో షాక్ తగిలింది. నెలకు 8 లక్షల రూపాయలు భార్యకి భరణంగా చెల్లించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. 2017 జనవరి 10న ఈ కేసు దాఖలైంది. కేసు దాఖలు చేసినప్పటినుంచి ఇప్పటి వరకు ఆమెకు నెలకు 8లక్షల రూపాయల చొప్పున భరణం చెల్లించాలని, ఇకపై ప్రతి నెలా 10వతేదీన భరణం చెల్లించాలని ఆదేశాలిచ్చింది.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం బాలిరెడ్డి పృథ్వీరాజ్ స్వగ్రామం. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో 1984లో ఆయనకు వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు. 2016లో భార్య, భర్త విడిపోయారు. ఆ తర్వాత భర్త పృథ్వీరాజ్ పై భార్య గృహ హింస కేసు పెట్టింది. పృథ్వీరాజ్ చెన్నైలో సినిమా ప్రయత్నాలు చేసే సమయంలో తమ కుటుంబమే అండగా ఉండేదని కోర్టుకి విన్నవించారు భార్య శ్రీలక్ష్మి. సినిమాల్లో బిజీ అయిన తర్వాత తనను ఇంటినుంచి గెంటివేశారని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం పృథ్వీరాజ్.. సీరియల్స్, సినిమాల ద్వారా నెలకి 30లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని, తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోర్టుకి విన్నవించింది. ఈ నేపథ్యంలో నెలకి 8 లక్షల రూపాయలు భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పునివ్వడం విశేషం.

ఆ మధ్య హైదరాబాద్ లో కూడా నటుడు పృథ్వీరాజ్ పై కేసు నమోదైంది. కవిత అనే మహిళ ఆయనపై కేసు పెట్టింది. రెండో భార్యగా స్వీకరించిన పృథ్వీ తనకు అన్యాయం చేస్తున్నారని పోలీస్ కేసు పెట్టింది. ఆ కేసు విచారణలో ఉంది. ఆమధ్య ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్న సమయంలో మహిళా ఉద్యోగినితో అసభ్యంగా ఫోన్లో సంభాషించారంటూ పృథ్వీరాజ్ పై ఆరోపణలు రావడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జనసేన వైపు వచ్చారు. 2024లో ఆయన జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు విజయవాడ కోర్టు తీర్పుతో పృథ్వీ మరోసారి వార్తల్లోకెక్కారు.

Tags:    
Advertisement

Similar News