షర్మిల చుట్టూ చేరుతున్న పాతకాపులు

సీనియర్లమని చెప్పుకుంటున్న వాళ్ళు మీడియాలో తప్ప బయట ఎక్కడా కనబడటంలేదు. అలాంటి వాళ్ళంతా షర్మిలను అధ్యక్షురాలిగా నియమించిన తర్వాత బయటకు వస్తున్నారు.

Advertisement
Update: 2024-01-21 04:38 GMT

కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోబోతున్న వైఎస్ షర్మిల చుట్టూ పాతకాపులు దడి కడుతున్నట్లున్నారు. ఇడుపులపాయకు శనివారం సాయంత్రం షర్మిల చేరుకున్నారు. ఆదివారం విజయవాడలోని ఒక కన్వెన్షన్ హాల్‌లో ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. షర్మిలతో పాటు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి యాదవ్ ఉన్నారు. వీళ్ళిద్దరే కాకుండా ఇప్పటికే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో షర్మిల భర్త బ్రదర్ అనీల్ భేటీ అయిన విషయం తెలిసిందే. సీనియర్లలో మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి కొందరు షర్మిలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అయితే జేడీ శీలం, పళ్ళంరాజు లాంటి చాలామంది షర్మిలకు మద్దతుగా నిలబడ్డారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వైఎస్‌కు ఒకప్పుడు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళలో చాలామంది షర్మిల చుట్టూ చేరుతున్నట్లు అర్థ‌మవుతోంది. కేవీపీ, రఘువీరా, పళ్ళంరాజు, శీలం, హర్షకుమార్, తులసిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నారని చెప్పుకోవటమే కానీ, యాక్టివ్ గా లేరని అందరికీ తెలిసిందే. ఎందుకంటే పార్టీ ఉనికినే జనాలు అసలు పట్టించుకోవటంలేదు. జనాల ఆద‌రణ కోల్పోయిన పార్టీకి ఉనికి ఎక్కడినుండి వస్తుంది..?

అందుకనే సీనియర్లమని చెప్పుకుంటున్న వాళ్ళు మీడియాలో తప్ప బయట ఎక్కడా కనబడటంలేదు. అలాంటి వాళ్ళంతా షర్మిలను అధ్యక్షురాలిగా నియమించిన తర్వాత బయటకు వస్తున్నారు. ఒకప్పుడు అంటే 2009 తర్వాత పార్టీలో నుండి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసినప్పుడు పైన చెప్పుకున్న సీనియర్లు ఎవరూ మద్దతుగా బయటకు రాలేదు. ఇదే సమయంలో జగన్ కూడా ఎవరినీ కలిసి మద్దతు అడగలేదు. వైఎస్ కు సన్నిహితులైన వాళ్ళంతా జగన్ కు కూడా సన్నిహితులవ్వాలని రూలేమీలేదు.

బొత్స సత్యనారాయణ లాంటి ఒకళ్ళిద్దరూ మాత్రమే ఇందుకు మినహాయింపు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ సీనియర్లతో జగన్ దూరం బాగా మైన్ టైన్ చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ దూరంపెట్టిన వాళ్ళల్లో చాలామంది ఇప్పుడు షర్మిల చుట్టూ చేరుతున్నారు. మరి వీళ్ళందరు షర్మిలను స్వేచ్ఛ‌గా పనిచేసుకోనిస్తారా..? అన్నదే అసలు పాయింట్. కాకపోతే తన దగ్గరకు వస్తున్న వాళ్ళలో ఎవరేమిటి అన్న విషయం షర్మిలకు తెలీకుండా ఏమీ ఉండదు. మరి ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News