కరుడుగట్టిన పసుపు జర్నలిస్టులపైనే దాడులు- సజ్జల

కేవలం కరుడుగట్టిన పసుపు దండు ముఠా సభ్యులుగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వారిపైనే కార్యకర్తలు ఆవేశాన్ని ప్రచురించారన్నారు. నిజమైన జర్నలిస్టులపై ఎక్కడా దాడులు జరగలేదన్నారు.

Advertisement
Update: 2023-05-23 12:41 GMT

అవినాష్‌ రెడ్డి విషయంలో మీడియా కథనాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి ఎక్కడికో పారిపోతున్నట్టు ఎందుకు కథనాలు ప్రసారం చేస్తున్నారని ప్రశ్నించారు.

అవినాష్ రెడ్డి ఎక్కడికీ పారిపోవడం లేదని సీబీఐకి సహకరిస్తూనే వచ్చారన్నారు. తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే విచారణ హాజరుకు గడువు అడిగారన్నారు. వివేకా కేసులో ఏం జరిగినా అది అవినాష్ రెడ్డికి, సీబీఐకి మధ్య వ్యవహారమేనన్నారు. సీబీఐ అధికారులు కర్నూలు వచ్చిన రాష్ట్ర పోలీసులను సంప్రదించి ఉంటే చట్టం ప్రకారం చేసేవారన్నారు. రాష్ట్ర పోలీసులకు సంప్రదించినట్టు సీబీఐ నుంచి కూడా ఎలాంటి ప్రకటన లేదన్నారు. కానీ మీడియా మాత్రం కేంద్ర బలగాలు వస్తున్నాయని రాసేశాయన్నారు.

ఏమీ లేకున్నా మీడియానే ఒక సునామీని సృష్టిస్తోందన్నారు. మీడియా కథనాలను చూసిన తర్వాత ఆవేదనతోనో, ప్రేమతోనే వైసీపీ కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు వచ్చి ఉంటారన్నారు. ఇలాంటి కథనాలు రాయకపోతే ఎవరూ వచ్చే వారు కాదన్నారు. మీడియా ప్రతినిధులపై దాడి గురించి స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తే కార్యకర్తలకు కడుపు మండకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలనే స్థాయిలో చర్చలు నడుపుతున్నారన్నారు.

కేవలం కరుడుగట్టిన పసుపు దండు ముఠా సభ్యులుగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వారిపైనే కార్యకర్తలు ఆవేశాన్ని ప్ర‌ద‌ర్శించార‌న్నారు. నిజమైన జర్నలిస్టులపై ఎక్కడా దాడులు జరగలేదన్నారు. అవినాష్ రెడ్డి డ్రామా చేస్తున్నారని ఒకవైపు కథనాలు వస్తుంటే కార్యకర్తలకు ఆవేశం వచ్చి ఉంటుందన్నారు. ఇలాంటి దాడులను వైసీపీ సమర్థించదన్నారు. కానీ వందల మంది ఉన్న చోటకు వెళ్లి తప్పుడు కథనాలతో రెచ్చగొడితేనే ఇలాంటి పరిణామాలుంటాయన్నారు.

Tags:    
Advertisement

Similar News