రఘురామకు గట్టి షాక్‌.. - వచ్చే ఎన్నికల్లో నో టిక్కెట్‌!

రఘురామకృష్ణరాజు నాలుగేళ్లకు పైగా నర్సాపురం నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నారు. ఆయన 2019లో గెలిచిన తర్వాత ఢిల్లీలోనే గడిపారు.

Advertisement
Update: 2024-03-24 05:24 GMT

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈసారి ఎన్నికల్లో టిక్కెట్‌ లేనట్టే. వైసీపీ అవకాశమివ్వడంతో జగన్‌ హవాలో గెలిచిన రఘురామ.. ఆ తర్వాత సీఎం జగన్‌ను వ్యతిరేకించి టీడీపీతో అంటకాగి.. పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ లేదా జనసేన లేదా బీజేపీలో ఏదో ఒక పార్టీ నుంచి తాను పోటీ చేయడం ఖాయమని ధీమా కూడా వ్యక్తం చేసిన రఘురామకు గట్టి షాక్‌ తగలబోతోందని తెలుస్తోంది.

పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ సీటు బీజేపీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే బీజేపీలో అభ్యర్థిని ఎంపిక చేయాలంటే జాతీయ నాయకత్వం నిర్ణయించాల్సి ఉంటుంది. తాను బీజేపీ కేంద్ర నాయకత్వానికి బాగా దగ్గర అని ఎంతలా రఘురామ చెప్పుకున్నా చివరికి ఆయనకు మొండిచేయి చూపించనున్నారని తెలుస్తోంది. మరోపక్క ఏపీ బీజేపీలో ఉన్న టీడీపీని వ్యతిరేకిస్తున్న సీనియర్‌ లీడర్లు కూడా ఆయన వద్దని కేంద్ర పెద్దలకు చెప్పేశారట. ఈ పరిణామాలతో రఘురామ నర్సాపురం బంధానికి పెద్ద బ్రేక్‌ పడటం ఖాయమని తెలుస్తోంది.

రఘురామకృష్ణరాజు నాలుగేళ్లకు పైగా నర్సాపురం నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నారు. ఆయన 2019లో గెలిచిన తర్వాత ఢిల్లీలోనే గడిపారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఆయన ఎలాంటి కార్యకలాపాలు చేశారనేది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అలాంటి వ్యక్తితో తమకు పేచీ ఎందుకని పవన్‌ కూడా బీజేపీ అడగగానే నర్సాపురం సీటును ఇచ్చేసి చేతులు దులుపుకొన్నారని తెలుస్తోంది.

ఇక బీజేపీ నర్సాపురంలో రఘురామ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి, దివంగత నటుడు అయిన కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని తమ అభ్యర్థిగా నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఆవిడ అయితే సరైన పోటీ ఉంటుందని, బలమైన నేపథ్యంతో పాటు కొత్త ముఖం కావడం, ప్రభాస్‌ క్రేజ్‌ ఇవన్నీ కూడా కలసివస్తాయని బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాలతో రఘురామ ఆశలు గల్లంతైనట్టే అని అర్థమవుతోంది. రఘురామకు బీజేపీ టిక్కెట్‌ దక్కకపోవడం ఇదే మొదటిసారి కాదు.. ఆయన 2014లో కూడా బీజేపీ నుంచి సీటు కోసం ప్రయత్నించారని, అప్పట్లో కూడా ఆయన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ రఘురామ మాత్రం తనవంతుగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి చివరికి ఏంజరుగుతుందనేది వేచిచూడాలి.

Tags:    
Advertisement

Similar News