పవన్ నిలబడతారా..? షూటింగ్ లకు వెళ్తారా..?

పవన్ కేవలం మూడు రోజుల కాల్షీట్లు ఖాళీ చేసుకుని విశాఖ వచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ తిరిగి షూటింగ్ లకు వెళ్తే ఆ విమర్శలను నిజం చేసినట్టవుతుంది.

Advertisement
Update: 2022-10-18 02:08 GMT

మంచో చెడో, పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు టాక్ ఆఫ్ ది ఏపీగా మారారు. పవన్ కల్యాణ్ మాటలు, పవన్ కల్యాణ్ వైరివర్గం మాటలు.. ఇవే మూడురోజులపాటు ఏపీలో పొలిటికల్ వార్తలు. ఒకరకంగా సీఎం జగన్ నంద్యాల జిల్లా టూర్ కంటే కూడా పవన్ యాత్రే ఎక్కువ ఆసక్తిని కలిగించింది. మరి ఈ హైప్ ని పవన్ నిలబెట్టుకోగలరా..?

ఎప్పటిలాగే తుస్సుమనిపిస్తారా..?

గతంలో కూడా పవన్ కి ఇలాంటి అవకాశాలు చాలానే వచ్చాయి. అమరావతి రైతులకోసం ముళ్లకంచెల మధ్య రోడ్డుపై కూర్చుని గతంలో ధర్నా చేశారు పవన్. జడివానలో ర్యాలీలు చేపట్టారు. అప్పట్లో ఇంతకంటే ఎక్కువ క్రేజ్ వచ్చింది. కట్ చేస్తే, మరుసటి రోజే పవన్ రాజకీయాలకు ప్యాకప్ చెప్పి సినిమా షూటింగ్ లకు వెళ్లేవారు. మళ్లీ వారం, రెండువారాలు జనసైనికుల్లో నైరాశ్యం. తిరిగి పవన్ ఎప్పుడు రాజకీయాలు మాట్లాడతారో మళ్లీ అప్పుడే జనసేనకు ఉత్సాహం. ఇలా ఉండేది పరిస్థితి. మరి ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందా.

వైసీపీ విమర్శలు నిజం చేస్తారా..?

ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని పవన్ ని డైరెక్ట్ గా అటాక్ చేశారు. పవన్ కేవలం మూడు రోజుల కాల్షీట్లు ఖాళీ చేసుకుని విశాఖ వచ్చారని, అవి పూర్తయ్యాక తిరిగి షూటింగ్ లకు వెళ్తారని, అంతకు మించి ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు పవన్ తిరిగి షూటింగ్ లకు వెళ్తే ఆ విమర్శలను నిజం చేసినట్టవుతుంది. కానీ అక్కడ సినీ ఇండస్ట్రీపరంగా చూస్తే పవన్ చేయాల్సిన సినిమాలు చాలానే పెండింగ్ లో ఉన్నాయి. ఎన్నికల్లోగా వాటన్నిటినీ ముగించుకోవాలనేదే పవన్ ఆలోచన. రాజకీయాల్లో ఖర్చు కోసమే తాను సినిమాలు చేస్తానంటున్న పవన్, రాజకీయాలకు ఫుల్ టైమ్ కేటాయించలేకపోవడం మైనస్ గానే చెప్పాలి. దాన్నే హైలెట్ చేస్తూ అటు వైసీపీ విమర్శల జోరు పెంచుతోంది. ఈ దశలో పవన్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

పవన్ కి దీటుగా పార్టీని నడిపేవారేరి..?

పవన్ కల్యాణ్ మీటింగ్ లకు వస్తే ఆ క్రేజ్ వేరు. నాదెండ్ల, నాగబాబుకి పార్టీలో పదవులు ఉన్నా కూడా జనసైనికులు వారి మాటల్ని ఎంత సీరియస్ గా తీసుకుంటారనేది అనుమానమే. ఎన్నికలకు సమయం తరుముకొస్తోంది, అధికారంలో ఉన్న సీఎం జగన్ కూడా ఎమ్మెల్యేలను గడప గడపకు వెళ్లాల్సిందేనని ఆదేశాలిచ్చేశారు. పదే పదే సమీక్షలు పెడుతూ ఎమ్మెల్యేలలో చురుకు పుట్టిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో అధికారం కావాలనుకుంటున్న ప్రతిపక్షాలు ఎంత అలర్ట్ గా ఉండాలి. ప్రతి నియోజకవర్గంలో బలపడాలనుకుంటున్న జనసేన ఏ స్థాయిలో పోరాటం చేయాలి. విశాఖ ఎపిసోడ్ తో రాజకీయం వేడెక్కింది, కానీ పవన్ సినిమా షూటింగ్ లకు వెళ్తే అది పూర్తిగా చల్లారిపోతుంది.

Tags:    
Advertisement

Similar News