పోలవరం సందర్శనకు పవన్.. అక్కడ ఏం చేస్తారంటే..?

పోలవరం సందర్శనకు వెళ్లబోతున్నారు పవన్. ఏ హోదాలో అక్కడకు వెళ్తారు, అక్కడ పోలవరం పనుల గురించి ఆయనకు ఎవరు వివరిస్తారు, అసలు పోలవరాన్ని సందర్శించి పవన్ ఏం చేస్తారనేది తేలాల్సి ఉంది.

Advertisement
Update: 2023-04-06 05:44 GMT

ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేయడానికి ప్రతిపక్షాలకు సరైన సబ్జెక్ట్ దొరకడంలేదు. తాజాగా పోలవరం ప్రాజెక్ట్, దాని ఎత్తు.. అనే అంశాలపై జగన్ ని ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి విపక్షాలు. తమ హయాంలో ఎక్కువ పనులు జరిగాయని, ఇప్పుడు నత్తనడకన సాగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. పోలవరం పేరుతో వైసీపీ రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టుపెడుతోందని అంటున్నారు జనసేన నేతలు. ఇటీవల పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిమరీ పోలవరంపై జలశక్తి శాఖ మంత్రికి ఫిర్యాదు చేసి వచ్చారు. ఏపీ ప్రభుత్వం సరిగా పనులు చేయడంలేదని అన్నారు. ఇప్పుడాయన పోలవరం సందర్శనకు వెళ్లబోతున్నారు. పవన్ ఏ హోదాలో అక్కడకు వెళ్తారు, అక్కడ పోలవరం పనుల గురించి ఆయనకు ఎవరు వివరిస్తారు, అసలు పోలవరాన్ని సందర్శించి పవన్ ఏం చేస్తారనేది తేలాల్సి ఉంది.

పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేసేందుకు అంగీకరిస్తూ ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత తమకు చాలా విషయాలు తెలిశాయని, ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆశ్చర్యానికి గురిచేశాయని చెప్పారు. త్వరలో పోలవరం ప్రాజెక్టును పవన్ కళ్యా సందర్శిస్తారని చెప్పారు నాదెండ్ల.

జగనన్న పాపాల పథకం..

పోలవరం జగనన్న పాపాల పథకం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నాదెండ్ల. పోలవరం ఎత్తు తగ్గించేందుకు ప్రభుత్వం సంతకాలు చేసిందా..? లేదా..? అనే విషయం జగన్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి ఖర్చులు రీ-ఇంబర్స్ చేస్తామని కేంద్రం చెప్పినా.. పనులెందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టు పూర్తి చేద్దామనే చిత్తశుద్ధి సీఎం జగన్ కు లేదన్నారు. పోలవరం నిర్మించకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటూ ఇప్పటికే పలు డెడ్ లైన్లు పెట్టారని, ఏదీ నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. పునరావాసం ఖర్చు తగ్గించుకునేందుకే పోలవరం ఎత్తు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందన్నారు నాదెండ్ల. 

Tags:    
Advertisement

Similar News