ముద్రగడపై పవన్ కల్యాణ్ సెటైర్లు

రిజర్వేషన్ గురించి మాట్లాడినా, ఇంకేం మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడాలన్నారు పవన్. పింక్ డైమండ్ లాగా అప్పుడొకలాగా, ఇప్పుడొకలాగా మాట్లాడతారా..? అని కౌంటర్ ఇచ్చారు.

Advertisement
Update: 2024-03-07 11:20 GMT

ముద్రగడ పద్మనాభం వైసీపీ ఎంట్రీ వ్యవహారంపై పవన్ కల్యాణ్ సెటైర్లు పేల్చారు. మొన్నటి వరకు అందరూ తనకు సలహాలిచ్చారని, ఇప్పుడు వారంతా వైసీపీలోకి వెళ్లిపోయారని ఇదేం రాజకీయం అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ దగ్గర ఉంటే వారికి అన్ని ఐడియాలు వస్తాయని సెటైర్లు పేల్చారు. రిజర్వేషన్ గురించి మాట్లాడినా, ఇంకేం మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడాలన్నారు. పింక్ డైమండ్ లాగా అప్పుడొకలాగా, ఇప్పుడొకలాగా మాట్లాడతారా..? అని కౌంటర్ ఇచ్చారు. కన్వీనియంట్ గా మాట్లాడే వ్యక్తులు తనకు అక్కర్లేదన్నారు. ముద్రగడ పేరెత్తకుండానే ఆయన వైసీపీలోకి వెళ్తున్న సందర్భంలో సలహాలిచ్చేవారు వెళ్లిపోయారంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు పవన్. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ జనసేనలో చేరుతున్న సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఆయనతో గతంలోనే పరిచయం ఉందని, ఆయన్ను సొంత ఇంటికి ఆహ్వానిస్తున్నానని చెప్పారు.


సంఖ్యా బలం ఉన్న కులాల్లో ఐక్యత లేకపోవడం వల్లే జగన్ కి ఊడిగం చేస్తున్నారని అన్నారు పవన్. తాను మాటలు చెప్పనని, సీఎం జగన్ లాగా చొక్కాలు మడతపెట్టనని, తొడలు కొట్టనని, జబ్బలు చరుచుకోనని చెప్పారు. కేజీఎఫ్, పుష్ప సినిమాల పుణ్యాన వారందరికీ రీ రికార్డింగ్ లు ఎక్కువైపోయాయని ఎద్దేవా చేశారు. సినిమాలు చేసి చేసి అవన్నీ తనకు అలవాటైపోయాయని, సినిమాలు చేయక జగన్ లాంటి వారికి అవి అవసరం అయ్యాయని చెప్పారు. సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం చెప్పమంటే నోరు తిరగనివారంతా ఇప్పుడు పంచ్ డైలాగులు కొడుతున్నారని అన్నారు పవన్.

ఇది 2009 కాదని, 20024 అని ఆ విషయం సీఎం జగన్ మరచిపోకూడదని అన్నారు పవన్. ప్రాణాలకు తెగించి రాజకీయాల్లోకి వచ్చానని పదే పదే పాతపాట పాడారు. గూండాలకు, రౌడీలకు భయపడబోనని, అదే సమయంలో వ్యూహం లేకుండా మూర్ఖంగా వెళ్లి ప్రాణాలర్పించే అజ్ఞానిని కూడా కాదని చెప్పుకొచ్చారు. సినిమాల్లో ఉంటే ఏ సన్నాసి కూడా తనను విమర్శించేవాడు కాదని, కానీ రాజకీయాల్లోకి వచ్చి మాటలు పడాల్సి వస్తోందన్నారు పవన్. ఇంకోసారి వైసీపీ గెలిస్తే రాయలసీమ ప్రాంత యువత గల్ఫ్ కి, ఇతర రాష్ట్రాలకు పర్మినెంట్ గా వలస పోవాల్సిందేనని హెచ్చరించారు. 

Tags:    
Advertisement

Similar News