జగన్ మీద ద్వేషం వ‌లంటీర్ల మీద చూపుతున్నారా?

ఏలూరులో మొదలైన రెండో విడత వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి వ‌లంటీర్లే కారణమని చేసిన ఆరోపణలు సంచలనంగా మారింది.

Advertisement
Update: 2023-07-10 05:09 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి రోజురోజుకు చాలా విచిత్రంగా మారిపోతోంది. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా జగన్మోహన్ రెడ్డి మీద కోపాన్ని వలంటీర్ల మీద చూపుతున్నారు. ఏలూరులో మొదలైన రెండో విడత వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి వ‌లంటీర్లే కారణమని చేసిన ఆరోపణలు సంచలనంగా మారింది. గతంలో చంద్రబాబునాయుడు కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి వ‌లంటీర్ల వ్యవస్థ‌ చాలా కీలకమని పవన్‌కు అనిపించినట్లుంది. ఈ వ్యవస్థ‌ను దెబ్బతీయకపోతే వైసీపీ విజయాన్ని అడ్డుకోలేమని అర్థ‌మైనట్లుంది.

అందుకనే సడెన్‌గా వలంటీర్ల వ్యవస్థ‌ మీద ఆరోపణలు మొదలుపెట్టారు. ఇంతకీ పవన్ చెప్పేదేమంటే రాష్ట్రంలో 32 వేల మంది మహిళలు అదృశ్యమైపోయారట. వారిలో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదట. అంటే అదృశ్యమైన 32 వేల మందిలో 14 వేల మంది ఆచూకీ దొరకలేదంటే మిగిలిన 18 వేల మంది ఆచూకీ దొరికినట్లే కదా. మరి మాటిమాటికీ 32 వేలమంది మాయమైపోయారని ఎందకు చెబుతున్నారు. ప్రతి ఇంటికి వలంటీర్లు వెళ్ళి కుటుంబంలో ఎంతమందున్నారనే వివరాలను సేకరిస్తున్నారట.

వారిలో మహిళలు ఎంత మంది? వివాహితులు ఎందరు? వితంతువులున్నారా? ఒంటరి మహిళలున్నారా అన్న వివరాలను సేకరిస్తున్నారట. తర్వాత ఆ వివరాలను సంఘ విద్రోహ శక్తులకు అందిస్తున్నట్లు పవన్ ఆరోపించారు. తర్వాతే ఒంటరి మహిళలు, వితంతువులు అదృశ్యమైపోతున్నారట. ఇలా మాయమైపోవటంలో వైసీపీలో కొందరు కీలక నేతల పాత్ర చాలా కీలకమని పవన్ ధ్వజమెత్తారు.

ఈ విషయాన్ని కేంద్ర నిఘా సంస్థలు తనకు చెప్పి ఆంధ్రాలో జనాలను అప్రమత్తం చేయమని చెప్పిందట. ఇక్కడే పవన్ చెప్పేది అనుమానంగా ఉంది. కేంద్ర నిఘా సంస్థ‌లు ఈ విషయాన్ని పవన్‌కు ఎందుకు చెబుతాయి? నిఘా సంస్థ‌ల నుండి బీజేపీ నేతలకు సమాచారం అందే అవకాశముంది కానీ ప్రత్యేకంగా పవన్‌కు ఎందుకు చెబుతుంది? అసలు పవన్‌కు చెబితే ఏమిచేయగలరు? పవన్ ఆరోపణలు నిజమే అయితే ఇన్నిసంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమిచేస్తున్నట్లు? మొత్తానికి వలంటీర్ల వ్యవస్థ‌ మీద పవన్ చాలా డ్యామేజింగ్ స్టేట్మెంటే ఇచ్చారు. మరి దీనికి ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News