పవన్‌ పచ్చి మోసగాడు, స్వార్థపరుడు - పోతిన మహేష్‌

జనసేన కోసం కష్టపడ్డ వాళ్ల కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డాయన్నారు పోతిన. జనసేనలో పని చేసిన వారికి టికెట్లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ వారికి ఎందుకు సీట్లు ఇచ్చారో.. కార్యకర్తలకు పవన్‌ సమాధానం చెప్పాలన్నారు.

Advertisement
Update: 2024-04-08 10:50 GMT

జనసేనకు రాజీనామా చేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోతిన మహేష్‌..ఆ పార్టీ చీఫ్‌ పవన్‌కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. పవన్‌ ఏం చేస్తున్నారో కనీసం ఆయనకు కూడా అర్థం కావడం లేదన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్‌ పని చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు పోతిన. పార్టీ నిర్మాణం, క్యాడర్‌ గురించి పవన్‌కల్యాణ్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. పవన్‌ది అంతా నటనేనంటూ దుమ్మెత్తిపోశారు. పవన్‌ సిద్ధాంతాలు స్వార్థపూరితమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ గురించి తెలిసే గతంలో ప్రజలు ఆయనను రెండు చోట్ల చిత్తుచిత్తుగా ఓడగోట్టారంటూ ఫైర్ అయ్యారు. 25 రోజుల తర్వాత జనసేన పరిస్థితి ఏంటో చెప్పగలరా అంటూ పవన్‌కు ప్రశ్నలు సంధించారు పోతిన. 21 సీట్లతో పార్టీకి, ప్రజలకు ఏం భవిష్యత్ ఇవ్వగలరంటూ పవన్‌కు సవాల్‌ విసిరారు.

జనసేన కోసం కష్టపడ్డ వాళ్ల కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డాయన్నారు పోతిన. జనసేనలో పని చేసిన వారికి టికెట్లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ వారికి ఎందుకు సీట్లు ఇచ్చారో.. కార్యకర్తలకు పవన్‌ సమాధానం చెప్పాలన్నారు. కాపు సామాజికవర్గాన్ని పవన్‌ బలి పెడుతున్నారని ఆరోపించారు. కాపు యువతను మోసం చేయోద్దని పవన్‌ను కోరారు. త్వరలోనే తన వద్ద ఆధారాలు బయటపెడతానన్నారు. వీరమహిళలకు పదవీకాలం పొడిగించి.. మిగతా పదవులకు ఎందుకు పొడిగించలేదన్నారు.

గతంలో పవన్‌ తల్లిని దూషించిన సుజనా చౌదరికి ఎలా సీటు ఇచ్చారని ప్రశ్నించారు పోతిన. పచ్చ నోట్లు పడేస్తే అన్ని మర్చిపోతారా అంటూ పవన్‌ను నిలదీశారు. ఈ అంశంపై కచ్చితంగా పవన్‌ సమాధానం చెప్పాలన్నారు. రాజధాని ప్రాంతంలో జనసేనను పవన్‌ చంపేశారన్నారు. బీజేపీ సీట్లు సర్దుబాటు చేయమని టీడీపీకి చెప్తే..జనసేన సీట్లు ఎందుకు త్యాగం చేసిందని ప్రశ్నించారు పోతిన. పొత్తు కుదుర్చింది జనసేన పార్టీ ఐతే సీట్లు ఎందుకు తగ్గించుకోవాలన్నారు పోతిన. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పోటీ చేయడానికి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా అంటూ పవన్‌ను కడిగిపారేశారు పోతిన.

పార్టీకి విధేయుడిగా ఉంటే నమ్మక ద్రోహం చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పోతిన. టీడీపీ, జనసేన మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయని..రాబోయే రోజుల్లో జనసేన అడ్రస్ గల్లంతు అవడం ఖాయమని జోస్యం చెప్పారు పోతిన. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గాల్లో సర్వే చేసి గెలిచే పశ్చిమ నియోజకవర్గాన్ని ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. బీసీలే త్యాగాలు చేయాలా..కమ్మ సామాజికవర్గం త్యాగాలు చేయదా అంటూ పవన్‌ను ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గం పెత్తందారులకు కాకుండా మరొకరికి ఇచ్చి ఉంటే సహకరించే వాళ్లమన్నారు పోతిన.

Tags:    
Advertisement

Similar News