ఇప్పట్లో ‘వారాహి’ యాత్ర లేనట్లేనా?

ఏకకాలంలో పవన్, లోకేష్ రాయలసీమలోనే యాత్రల్లో ఉంటే యువగళంలో జనాలుండరు. అందుకనే తక్కువలో తక్కువ మరో రెండు మూడు నెలలవరకు అంటే లోకేష్ రాయలసీమను దాటేంతవరకు వారాహి యాత్రుండే అవకాశాలు లేవని సమాచారం.

Advertisement
Update: 2023-02-07 06:33 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించాల్సిన వారాహి యాత్ర ఇప్పట్లో లేనట్లేనా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న చర్చలను గమనిస్తే ఈ విషయం నిజమే అనిపిస్తోంది. వారాహి యాత్ర ఎప్పటినుండి ప్రారంభించేది పవన్ చెప్పలేదు. అయితే వీలైనంత తొందరలోనే ప్రారంభించబోతున్నట్లు మాత్రం చెప్పారు. వారాహికి పూజలు చేయించారు కాబట్టి తొందరలోనే యాత్ర మొదలుకాబోతోందని జనసేన నేతలు కూడా అనుకుంటున్నారు. అయితే పవన్ యాత్ర ఇప్పట్లో ఉండదనే సంకేతాలు అందుతున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు.

ఒకవైపు లోకేష్ ఆధ్వర్యంలో యువగళం పాదయాత్ర, మరోవైపు పవన్ ఆధ్వర్యంలో వారాహి యాత్రతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్లాన్ జరిగినట్లు రెండు పార్టీల నుండి వార్తలు వచ్చాయి. అయితే లోకేష్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయినట్లు పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి. లోకేష్ ఎక్కడ నాలుగు మాటలు మాట్లాడినా అందులో పది తప్పులుంటున్నాయి. దాంతో యువగళంపై బాగా నెగిటివ్ ప్రచారం పెరిగిపోతోంది.

లోకేష్ మాటలను వైసీపీ సోషల్ మీడియానే వైరల్ చేస్తోందంటేనే యువగళం ఎంత ఫ్లాప్ అయ్యిందో అర్థ‌మైపోతోంది. ఈ నేపథ్యంలో పవన్ ఆధ్వర్యంలో వారాహి యాత్ర మొదలైతే యువగళానికి మొదటికే మోసం వస్తుందని చంద్రబాబులో ఆందోళన పెరిగిపోతోందట. ఎందుకంటే పవన్ కూడా తన వారాహి యాత్రను తిరుపతి నుండే ప్రారంభించాలని అనుకున్నారు. కుప్పంలో మొదలైన లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం పూతలపట్టు నియోజకవర్గంలో సాగుతోంది. చిత్తూరు జిల్లాను తొందరలోనే దాటేసినా రాయలసీమలోనే ఇంకా చాలారోజులుంటుంది.

ఇదే జరిగితే లోకేష్ పాదయాత్రకు పెద్ద దెబ్బ పడటం ఖాయం. ఎందుకంటే వారాహి యాత్ర వైపే జనాలు మొగ్గు చూపుతారు. ఏకకాలంలో పవన్, లోకేష్ రాయలసీమలోనే యాత్రల్లో ఉంటే యువగళంలో జనాలుండరు. అందుకనే తక్కువలో తక్కువ మరో రెండు మూడు నెలలవరకు అంటే లోకేష్ రాయలసీమను దాటేంతవరకు వారాహి యాత్రుండే అవకాశాలు లేవని సమాచారం. మొత్తానికి పవన్, చంద్రబాబు మంచి అండర్ స్టాండింగ్‌తోనే రాజకీయాలు చేస్తున్నారని అర్థ‌మవుతోంది. మరి ఫైనల్ రిజల్ట్‌ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News