మంగళగిరి నాదే.. వైసీపీపై లోకేష్ సెటైర్లు

టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మంగళగిరి ఎమ్మెల్యేగా తాను పట్టాలు పంపిణీ చేస్తానన్నారు లోకేష్. ముఖ్యమంత్రి ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నా కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.

Advertisement
Update: 2022-11-16 03:05 GMT

మంగళగిరి నియోజకవర్గంలో విజయం తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు నారా లోకేష్. 2019లో మంత్రి హోదాలో ఉండి కూడా ఇక్కడ పరాజయం పాలైన ఆయన.. అప్పటినుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఉన్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. స్థానికంగా సొంత డబ్బులతో రోడ్లు వేయిస్తూ, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ, తోపుడు బండ్లు పంచి పెడుతూ ప్రజలకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ సెటైర్లు పేలుస్తున్నారు.

ఎమ్మెల్యే కనపడుటలేదు..

రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్తున్నారని, కానీ మంగళగిరిలో మాత్రం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనపడటం లేదని ఎద్దేవా చేశారు లోకేష్. వైసీపీ కార్యకర్తలు ఉన్న ఏరియాల్లో మాత్రమే ఆయన పర్యటిస్తున్నారని, టీడీపీ సానుభూతిపరులు ఉన్న ప్రాంతాలకు రావడానికి భయపడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు పోలకంపాడు కట్టపై నివసిస్తున్న వారందరకీ పట్టాలిస్తానన్న ఎమ్మెల్యే ఏమయ్యాడంటూ ఆయన స్థానికుల్ని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యే కనపడటం లేదంట, ఎక్కడున్నారో వైసీపీ నాయకులే చెప్పాలన్నారు లోకేష్.

నేనే వస్తా, అన్నీ నెరవేరుస్తా..

అటవీ, కొండపోరంబోకు, ఇరిగేషన్‌ స్థలాల్లో పట్టాలిస్తానని చెప్పి దొంగ హామీలిచ్చి గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి అని విమర్శించారు లోకేష్. టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మంగళగిరి ఎమ్మెల్యేగా తాను పట్టాలు పంపిణీ చేస్తానన్నారు. ముఖ్యమంత్రి ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నా కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. తనను చూసి ప్రభుత్వం డబ్బులు కేటాయించి అభివృద్ధి చేస్తుందని అనుకున్నా, అది కూడా చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్త యాత్ర మొదలు పెట్టేలోగా మంగళగిరిలో ప్రతి ఇంటి తలుపు తట్టాలనుకుంటున్నారు లోకేష్. అందుకే బాదుడే బాదుడు కార్యక్రమంలో స్పీడ్ పెంచారు.

Tags:    
Advertisement

Similar News