విశాఖ ఘటనను సమర్థించుకున్న నాగబాబు

జనసేన నేత నాగబాబు మాత్రం ట్విట్టర్ వేదికగా వైసీపీపైనే సెటైర్లు వేశారు. 'పగలు వర్షం చుక్కలు.. రాత్రి ఆకాశంలో చుక్కలు..ఏదేమైనా చుక్కలు చూపిస్తున్న ప్రకృతి' అని ట్వీట్ చేశారు.

Advertisement
Update: 2022-10-15 14:55 GMT

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైసీపీ మంత్రుల కార్లపై జనసైనికులు చేసిన రాళ్ల దాడిని ఆ పార్టీ నేత నాగబాబు పరోక్షంగా సమర్థించుకున్నారు. జనసైనికులు మంత్రుల కార్లపై దాడి చేయడంపై పార్టీ శ్రేణులను దండించకుండా వైసీపీని టార్గెట్ చేసి సెటైర్లు వేశారు. ఇవాళ విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో వైసీపీ మంత్రులు, నాయకులు, ఆ పార్టీ శ్రేణులు తరలివచ్చారు.

కాగా, రేపు విశాఖ నగరంలో జరగబోయే జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విశాఖకు వచ్చారు. కాగా పవన్‌కు స్వాగతం పలకడానికి వెళ్లిన జనసైనికులు అక్కడ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, జోగి రమేష్ కార్లపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు.

ఈ ఘటనపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఆయన సోదరుడు, జనసేన నేత నాగబాబు మాత్రం ట్విట్టర్ వేదికగా వైసీపీపైనే సెటైర్లు వేశారు. 'పగలు వర్షం చుక్కలు.. రాత్రి ఆకాశంలో చుక్కలు..ఏదేమైనా చుక్కలు చూపిస్తున్న ప్రకృతి' అని ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్‌ను బట్టి విశాఖలో మంత్రులపై జనసైనికులు దాడి చేయడాన్ని సమర్థించుకున్నట్లుగా ఉందని విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నాయకులకు జన సైనికులు చుక్కలు చూపించారని పరోక్షంగా సెటైర్లు వేశారు. కాగా నాగబాబు చేసిన ఈ కామెంట్స్ పై ట్విట్టర్ వేదికగా వైసీపీ శ్రేణులు తిప్పికొడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News