Shall బదులు May.. ఏపీ కష్టాలకు కారణం కాంగ్రెస్సేనన్న విజయసాయి

ఆ తప్పుల తడకకు కారణం జైరాం రమేష్ అంటూ ధ్వజమెత్తారు. దురదృష్టవశాత్తూ ఆయన Shall అనే పదం వాడాల్సిన ప్రతి చోటా May అనే పదం వాటడం వల్ల ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ హామీల అమలుని లైట్ తీసుకుందని అన్నారు.

Advertisement
Update: 2022-08-09 03:12 GMT

రాష్ట్ర విభజన వల్ల నష్టపోయామని భావిస్తున్న ఏపీ ప్రజలు ఆ పాపానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఇప్పటికీ బలంగా నమ్ముతుంటారు. ఆ తర్వాత కొనసాగుతున్న విభజన కష్టాలకు కూడా కాంగ్రెస్సే కారణం అని పార్లమెంట్ లో మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీ విభజన చట్టాన్ని తప్పుల తడకగా రూపొందించడం వల్లే హామీల అమలులో ఎన్డీయే ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని చెప్పారాయన. ఆ తప్పుల తడకకు కారణం జైరాం రమేష్ అంటూ ధ్వజమెత్తారు. దురదృష్టవశాత్తూ ఆయన Shall అనే పదం వాడాల్సిన ప్రతి చోటా May అనే పదం వాటడం వల్ల ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ హామీల అమలుని లైట్ తీసుకుందని అన్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూడా కారణం అదే..

ఒడిశాలోని గనుల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కి బొగ్గు సరఫరా విషయంలో కచ్చితమైన నిబంధనలు లేకపోవడంతో.. స్టీల్ ప్లాంట్ లోని రెండు ఫర్నేస్ లు మూతపడ్డాయని, దానివల్లే వైజాగ్ స్టీల్స్ నష్టాల్లోకి వెళ్లిందని, ఇప్పుడు ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు ఆలస్యం కావడానికి కూడా Shall, May అనే పదాలే కారణం అని ఎద్దేవా చేశారు. అప్పట్లో జైరాం రమేష్ విస్మరించిన అంశాల వల్లే ఏపీ ఇప్పటికీ మూల్యం చెల్లించుకుంటోందన్నారు విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ప్రతిపాదించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద మూడు సంవత్సరాలుగా డీపీఆర్‌ పెండింగ్‌ లో ఉందని గుర్తు చేశారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసే సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి రైల్వే మంత్రిని కోరారు. దేశంలో మొత్తం 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నా ఏపీలో ఒక్కటీ లేదన్నారు.

రైల్వే జోన్ పై కేంద్రం కీలక ప్రకటన..

పార్లమెంట్ లో ఎంపీ విజయసాయి ప్రశ్నలకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. భవన నిర్మాణానికి స్థల సేకరణ కూడా పూర్త‌యిందని అన్నారు. జోన్‌ ఏర్పాటుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. డీపీఆర్‌ ఆమోదించామని వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News