కాపు వర్సెస్ కాపు.. జోగయ్యకు గుడివాడ మరో లేఖాస్త్రం

జోగయ్య లేఖ గుడివాడకు బాగానే మంట పెట్టినట్టుంది. అందుకే తొలి లేఖకు జవాబు రాకపోయే సరికి మలి లేఖ సంధించారు. ఈసారి వంగవీటి రంగా హత్యతో లింకు పెడుతూ జోగయ్యను ఇరుకున పెట్టాలని చూశారు అమర్నాథ్.

Advertisement
Update: 2023-02-07 10:28 GMT

ఏపీలో కాపు రాజకీయం వేడెక్కింది. ఆ పార్టీలోని కాపులు, ఈ పార్టీలోని కాపులు గొడవపడుతూ.. మధ్యలో పార్టీలతో సంబంధంలేని వారికి కూడా చురకలంటిస్తున్నారు. తాజాగా హరిరామ జోగయ్యకు మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి లేఖాస్త్రం సంధించారు. అయితే ఈ లేఖల వ్యవహారం జోగయ్యతోనే మొదలైంది. పవన కల్యాణ్ ని సమర్థించే క్రమంలో ఆయన.. మంత్రిని అవమానించారు. నువ్వు బచ్చావి, మంత్రి పదవికి అమ్ముడుపోయావంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తూ లేఖ రాశారు. దీంతో అమర్నాథ్ కూడా అంతే ఘాటుగా బదులిచ్చారు. అయితే ఎక్కడా జోగయ్యపై కామెంట్లు వేయకుండా జాగ్రత్తపడ్డారు. పవన్ కల్యాణ్ కి రాయాల్సిన లేఖను తనకు రాశారంటూ సెటైర్లు పేల్చారు. మీరు మానసికంగా దృఢంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ వ్యంగోక్తులు విసిరారు.

లెటర్-2

అక్కడితో ఆ వివాదం సమసిపోలేదు. జోగయ్య లేఖ గుడివాడకు బాగానే మంట పెట్టినట్టుంది. అందుకే తొలి లేఖకు జవాబు రాకపోయే సరికి మలి లేఖ సంధించారు. ఈసారి వంగవీటి రంగా హత్యతో లింకు పెడుతూ జోగయ్యను ఇరుకున పెట్టాలని చూశారు అమర్నాథ్. “వంగవీటి రంగాని చంపించింది చంద్రబాబు నాయుడు అని మీరే పలు సందర్భాల్లో చెప్పారు. అలాంటి చంద్రబాబుతో పొత్తులకు సిద్ధమైన పవన్ కల్యాణ్ ని మీరు సమర్థిస్తారా..?. స్పష్టం చేయగలరు..” అంటూ రెండో లెటర్ ని ట్విట్టర్లో విడుదల చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.


పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీలోని కాపు నేతలు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. అయితే కాపు సామాజికవర్గంలోని ఇతర నేతలకు ఈ విమర్శలు రుచించడంలేదు. కాపులకోసం పెట్టిన పార్టీ జనసేన అనేది వారి ప్రగాఢ నమ్మకం. కానీ జనసేనను ఆయన తీసుకెళ్లి కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబుకి తాకట్టుపెడుతున్నారనేది వైసీపీ నేతల ఆరోపణ. వైసీపీలో జగన్ నాయకత్వంలోనే కాపులకు అధికారాలు దక్కాయని, న్యాయం జరిగిందనేది వారి వాదన. ఈ వాద ప్రతివాదాలు ఎలా ఉన్నా.. పవన్ కల్యాణ్ విషయంలో కాపు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Tags:    
Advertisement

Similar News