గుడివాడ అమర్‌నాథ్‌కు కొత్త చిక్కు.. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే ఆందోళనలో మంత్రి?

గుడివాడ అమర్‌నాథ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన నివాసం ఉండేది గాజువాక నియోజకవర్గం. మొదటి నుంచి రాజకీయాలు చేసింది విశాఖ సిటీలో.. కానీ టికెట్ మాత్రం అనకాపల్లి నుంచి వచ్చింది.

Advertisement
Update: 2022-12-18 04:27 GMT

ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఈ మధ్య చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలను విమర్శించడంలో అమర్‌నాథ్ ముందుంటున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్‌గా అమర్‌నాథ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్ వద్ద కూడా అమర్‌నాథ్‌కు మంచి పేరే ఉన్నది. రాబోయే ఎన్నికల్లో ఆయనకు టికెట్ కన్ఫార్మ్ అని పార్టీలో చర్చ జరుగుతోంది. కానీ, ఇటీవల జరిగిన పార్టీ వర్క్ షాప్‌లో అమర్‌నాథ్ పని తీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి వెనుకబడ్డారని, లోకల్‌లో తిరగడం లేదని జగన్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అమర్‌నాథ్‌పై వచ్చిన ఈ కామెంట్ల వెనుక కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

గుడివాడ అమర్‌నాథ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన నివాసం ఉండేది గాజువాక నియోజకవర్గం. మొదటి నుంచి రాజకీయాలు చేసింది విశాఖ సిటీలో.. కానీ టికెట్ మాత్రం అనకాపల్లి నుంచి వచ్చింది. అక్కడి నుంచి గెలిచి మంత్రి అయినా సరే.. స్థానికులు మాత్రం ఆయనను నాన్-లోకల్ క్యాండిడేట్‌గానే చూస్తున్నారు. వచ్చేసారి అమర్‌నాథ్‌కు అనకాపల్లి టికెట్ ఇవ్వొద్దని సీఎం జగన్‌కు రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. ఆయన బదులు స్థానిక నాయకులకు టికెట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ విషయం అమర్‌నాథ్‌కు కూడా తెలుసు. స్వయంగా జగన్ ఆయనను పిలిచి.. ఈ సారి వేరే స్థానం ఏదైనా చూసుకొని వర్క్ చేసుకో అని చెప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెందుర్తి, గాజువాక లేదా యలమంచిలి నియోజకవర్గాల్లో ఏదైనా ఒక స్థానం నుంచి పోటీ చేయాలని అమర్‌నాథ్ భావిస్తున్నారు. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తాడనే రిపోర్టులు సర్వేల్లో వచ్చినట్లు టాక్ నడుస్తోంది. అయితే, ఇప్పుడు గడప గడపకు ప్రోగ్రాం అనకాపల్లిలో చేయడం వల్ల మంత్రికి వచ్చే లాభం ఏంటో తెలియడం లేదు. వచ్చే సారి ఎలాగూ అక్కడి నుంచి పోటీ చేయడం మీద క్లారిటీ లేదు. సీఎం జగన్ కూడా వేరే నియోజకవర్గం చూసుకోమని సలహా ఇచ్చారు. దీంతో అనకాపల్లిపై కాస్త ఫోకస్ తగ్గించారు. అలాగని ఇప్పటికిప్పుడు గాజువాక, పెంబర్తి, యలమంచిలి నియోజకవర్గాల్లో తిరగలేరు. అక్కడ ఉన్నది కూడా వైసీపీ ఎమ్మెల్యేలే. వారిని కాదని తాను ఇప్పుడు నియోజకవర్గాల్లో తిరిగితే పార్టీలో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ కారణంతోనే అమర్‌నాథ్ ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తున్నది.

ఒకవైపు అనకాపల్లిపై పూర్తిగా దృష్టిపెట్టలేక.. మరోవైపు వేరే నియోజకవర్గంలో తిరగలేక సతమతమవుతున్నారు. సీఎం వైఎస్ జగన్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్టును ముందుగానే ప్రకటించే అవకాశం ఉన్నది. అప్పటి వరకు వెయిట్ చేసి.. అభ్యర్థులను ప్రకటించగానే.. తనకు కేటాయించిన నియోజకవర్గం నుంచి ప్రచారం చేద్దామనే ఆలోచనలో అమర్‌నాథ్ ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ కారణం వల్లే అనకాపల్లిలో కూడా తిరగడం లేదు. మరోవైపు మంత్రిగా కూడా బిజీగా ఉండటంతో స్థానికంగా ఎక్కువ సేపు గడపలేక పోతున్నారు. అందువల్లే స్థానిక నాయకత్వం కూడా ఆయనపై కాస్త గుర్రుగా ఉన్నది. ఏదైమైనా తనకు కేటాయించే నియోజకవర్గంపై క్లారిటీ వచ్చే వరకు పూర్తి స్థాయిలో ఏదీ చేయకూడదని మంత్రి అమర్‌నాథ్ డిసైడ్ అయినట్లు తెలుస్తున్నది. సీఎం జగన్ కూడా గతంలో తనకు వేరే నియోజకవర్గం కేటాయిస్తానని మాట ఇచ్చినందు వల్ల.. అనకాపల్లి గడప గడప కార్యక్రమానికి సంబంధించి నెగెటివ్ రిపోర్టు వచ్చినా.. అమర్‌నాథ్ పట్టించుకోక పోవడానికి కారణం ఇదే అని తెలుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News