ధర్మానకు ఏమైంది..? పదే పదే ఎందుకిలా..?

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయని కుటుంబాల గడప కూడా తాను తొక్కనన్నారు మంత్రి ధర్మాన. పార్టీలో నాయకత్వ బాధ్యత నిర్వహించలేని వారు స్వచ్ఛందంగా తప్పుకుని కొత్త వారికి అవకాశం కల్పించాలన్నారు.

Advertisement
Update: 2023-05-10 02:05 GMT

మంత్రి ధర్మాన ప్రసాదరావు పదే పదే సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా మారారు. గత కొంతకాలంగా ధర్మాన బహిరంగ సభకు వస్తున్నారంటే చాలు కచ్చితంగా ఏదో ఒక కలకలం రేపుతారనే పేరు పడిపోయింది. తాజాగా ఆయన మరోసారి మాటల తూటాలు పేల్చారు. ప్రతిపక్షాలపైనే కాదు, ప్రజలపై, సొంత పార్టీ నేతలపై కూడా ధర్మాన విరుచుకుపడటం సహజంగా మారిపోయింది. ఈసారి ఆయన సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేశారు. పార్టీలోనే కొనసాగుతూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని బహిష్కరిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని ఇప్పటికే గుర్తించామని, ఏరివేత చర్యలు త్వరలో మొదలవుతాయని హెచ్చరించారు. మరోవైపు వలంటీర్లపై కూడా ఆయన మండిపడ్డారు. వలంటీర్లతో అప్రమత్తంగా ఉండాలని, పార్టీకి వారు చేటు తెచ్చే అవకాశాలున్నాయని అన్నారు.

ఆ గడపలు తొక్కను..

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయని కుటుంబాల గడప కూడా తాను తొక్కనన్నారు మంత్రి ధర్మాన. ప్రస్తుతం తాము చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవాలని, పార్టీ పటిష్టతకు బాధ్యతగా పనిచేయాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. నాయకత్వ బాధ్యత నిర్వహించలేని వారు స్వచ్ఛందంగా తప్పుకుని కొత్త వారికి అవకాశం కల్పించాలన్నారు.

ఆమధ్య అమరావతి రైతుల అరసవెల్లి యాత్ర సందర్భంలో కూడా ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రకు వచ్చి మా పీక కోస్తారా అని ప్రశ్నించారు. వారిని రాజకీయంగా చితక్కొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఓ సభలో.. వైసీపీకి ఓటు వేయకపోతే వారి చేయిని వారే నరుక్కున్నట్టు అంటూ కలకలం రేపారు ధర్మాన. తన సభనుంచి వెళ్లిపోతున్న మహిళలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సభ అయిపోయాకే ఆటోలు తీయాలంటూ ఆయన డ్రైవర్లకు హుకుం జారీ చేశారు.

పోరంబోకులు..

ఏపీలో మగాళ్లంతా పోరంబోకుల్లా తిరుగుతున్నారంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన. వైసీపీకి ఓటు వేస్తామని ఏ కుటుంబం అయినా చెబితే, వెంటనే వారితో దేవుడి పటంపై ఒట్టు వేయించాలని ఓ సందర్భంలో పార్టీ నాయకులకు సూచించారు. వలంటీర్లపై కూడా ఆయన తరచూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదాహరణలున్నాయి. పదే పదే తన వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

Tags:    
Advertisement

Similar News