నాగబాబు, తులసిరెడ్డి.. రామోజీరావుని కాపాడగలరా..?

మార్గదర్శి కేసులో ఏపీలో ప్రతిపక్షాలన్నీ అధికార వైసీపీకి వ్యతిరేకంగా స్టేట్ మెంట్లు ఇస్తున్నాయి. ఈ స్టేట్ మెంట్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయినా.. ఈనాడు మాత్రం వాటిని హైలెట్ చేస్తోంది.

Advertisement
Update: 2023-04-09 05:01 GMT

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీ సీఐడీ విచారణ చేపట్టింది. ఇప్పటికే మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లను అరెస్ట్ చేశారు. సంస్థ యజమానులైన రామోజీరావుని, ఆయన కోడలు శైలజా కిరణ్ ని సీఐడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబడుతున్నారు. ఈ విచారణ పర్వం కొనసాగుతున్న క్రమంలో.. మార్గదర్శిపై కక్షసాధింపు చర్యలు చేపట్టారంటూ ఆరోపణలు మొదలయ్యాయి. ఈనాడు వైసీపీకి వ్యతిరేకం అని, అందుకే ఈనాడు అనుబంధ సంస్థలపై కావాలనే నిందలు వేస్తున్నారని అంటున్నారు. ఇలా మార్గదర్శికి సపోర్ట్ గా మాట్లాడేవారందరినీ ఈనాడు హైలెట్ చేస్తోంది. మార్గదర్శికి అనుకూలంగా మాట్లాడు, ఈనాడులో ఫ్రీ పబ్లిసిటీ పట్టు.. అన్నట్టుగా మారింది వ్యవహారం.

ఆమధ్య నాగబాబు, రామోజీరావు కేసుల వ్యవహారంలో భారీ ట్వీట్ వేశారు. ఆయన్ను వేధిస్తున్నారని అన్నారు. మార్గదర్శి కేసు విచారణ కక్షసాధింపేనని చెప్పారు. ఆ ట్వీట్ ని జనసేన కూడా అధికారికంగా షేర్ చేసింది. అంటే కచ్చితంగా అది జనసేన రియాక్షనే అనుకోవాలి. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కూడా రామోజీరావుకి మద్దతు ప్రకటించింది. వైసీపీపై ఈనాడులో వస్తున్న వార్తలను జీర్ణించుకోలేకే రామోజీరావుపై అక్రమ కేసులు పెట్టారని అంటున్నారు కాంగ్రెస్ నేత తులసి రెడ్డి. మార్గదర్శి విశ్వసనీయ సంస్థ అని చెప్పారాయన. ఆవు, దూడ బాగుండగా మధ్యలో గుంజ కొచ్చింది గురక రోగం అన్నట్టుగా ఆ మార్గదర్శి విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలి ఉందన్నారు తులసిరెడ్డి. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపులను ప్రజలు హర్షించరని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనం అని చెప్పారు. ఇప్పటికైనా మార్గదర్శి సంస్థపై కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం మానుకోవాలన్నారు.

అటు టీడీపీ కూడా మార్గదర్శికి సపోర్ట్ గా స్టేట్ మెంట్లు ఇస్తోంది. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థను దెబ్బతీసేందుకు రామోజీరావు, ఆయన కుటుంబ సభ్యులపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు సెక్షన్లతో కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు వైఎస్ఆర్ రామోజీ ఫిలింసిటీ రహదారులు పగలగొట్టి పైశాచికంగా వ్యవహరించారని చెప్పారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారాలపై సీఎం జగన్‌ ఎందుకు దృష్టి పెట్టడంలేదని ప్రశ్నించారు.

మార్గదర్శి కేసులో ఏపీలో ప్రతిపక్షాలన్నీ అధికార వైసీపీకి వ్యతిరేకంగా స్టేట్ మెంట్లు ఇస్తున్నాయి. ఈ స్టేట్ మెంట్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయినా.. ఈనాడు మాత్రం వాటిని హైలెట్ చేస్తూ కక్షసాధింపు అంటూ కవర్ చేస్తోంది. 

Tags:    
Advertisement

Similar News