'మా నమ్మకం నువ్వే జగన్'.. ఆ ఎమ్మెల్యేకి నమ్మకం లేదా..?

10 రోజులుగా 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమానికి ఆర్కే డుమ్మా కొడుతున్నారని తేలిపోయింది. మరి దీనిపై ఆయన వివరణ ఇస్తారో లేదో చూడాలి.

Advertisement
Update: 2023-04-17 07:44 GMT

ఏపీలో గడప గడపతోపాటు 'మా నమ్మకం నువ్వే జగన్' అనే కార్యక్రమం కూడా జోరుగా సాగుతోంది. ప్రతి ఇంటికీ వెళ్లి గోడపై స్టిక్కర్ అతికించడం, సెల్ ఫోన్ కోసం మరో చిన్న స్టిక్కర్ ఇవ్వడం, మిస్డ్ కాల్ ఇప్పిండచం.. ఇదీ నాయకుల పని. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలు.. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్వయానా వారే సంచి తగిలించుకుని స్టిక్కర్లు పట్టుకుని వెళ్తున్నారు. జగన్ పై తమకున్న విధేయత చాటుకుంటున్నారు. అయితే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఈనెల 7న ఈ కార్యక్రమం మొదలైంది. పదిరోజులైనా ఒక్కరోజు కూడా ఎమ్మెల్యే ఆర్కే ఆ వైపు చూడలేదు. అయితే ఆయన నియోజకవర్గంలోనే ఉన్నారని, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, పార్టీ చెప్పిన ప్రోగ్రామ్ లో మాత్రం పాల్గొనడంలేదని తెలుస్తోంది.

ఎందుకిలా..?

ఇటీవల గడప గడప కార్యక్రమంపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్షకు కూడా ఆర్కే హాజరు కాలేదు. తనకు ఆరోగ్యం బాగోలేదని, అందుకే రాలేకపోయానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అక్కడితో ఆ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడిందని అనుకున్నా.. 10రోజులుగా 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమానికి ఆర్కే డుమ్మా కొడుతున్నారని తేలిపోయింది. మరి దీనిపై కూడా ఆయన వివరణ ఇస్తారో లేదో చూడాలి.

2024 ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచి టీడీపీ త‌ర‌ఫున‌ నారా లోకేష్ పోటీ చేస్తారని అంటున్నారు. మరి వైసీపీ నుంచి ఆర్కేకే తిరిగి అవకాశమిస్తారా..? లేదా అనేది తేలాల్సి ఉంది. చేనేత వర్గం ఎక్కువగా ఉన్న మంగళగిరి నియోజకగవర్గ పరిధిలో ఇటీవలే కొందరు బీసీ నేతలు వైసీపీలో చేరారు. వారికి అధిష్టానం ప్రాధాన్యమిస్తున్నట్టు తేలిపోయింది. ఈసారి ఎన్నికల్లో చేనేత వర్గానికి వైసీపీ టికెట్ ఇచ్చి లోకేష్ పై పోటీకి దింపుతారని అంటున్నారు. ఈ దశలో టికెట్ పై నమ్మకం లేకే ఎమ్మెల్యే ఆర్కే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారా.. లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది తేలాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News