చరిత్ర రిపీట్ చేస్తా.. పవన్ ఓటమిపై పాల్ జోస్యం

గతంలో చిరంజీవిని ఓడించినట్టే ఇప్పుడు పవన్ కల్యాణ్ ని కూడా ఓడిస్తానని చెప్పారు పాల్. ప్రజలకు బుద్ధి ఉంటే పవన్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని సెలవిచ్చారు

Advertisement
Update: 2024-03-23 07:19 GMT

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కేఏపాల్ ని కామెడీ పీస్ గా తీసుకున్నా కొన్ని సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు సీరియస్ గా కూడా నవ్వులు పంచుతాయి. అందులోనూ పవన్ ని తమ్ముడూ అంటూ ఆయన ఆప్యాయంగా పిలవడం, అంతలోనే ఓ రేంజ్ లో ఫైరవ్వడం.. పాల్ కే చెల్లుతుంది. తాజాగా మరోసారి పవన్ కల్యాణ్ పై పంచ్ లు విసిరారు పాల్. పిఠాపురంలో ఆయన్ను ఓడించడం గ్యారెంటీ అన్నారు. అయితే ఆ సమయానికి తనకు ఫ్లైట్ మిస్ కాకుండా ఉండాలంటూ చిన్న కండిషన్ పెట్టారు కేఏ పాల్.

తాను రహస్యంగా పిఠాపురం వెళ్తే దాదాపు 200మంది అభిమానులు తన దగ్గరకు వచ్చారని, అందులో 80 శాతం మంది కాపులేనని చెప్పారు కేఏ పాల్. వారంతా తనని పిఠాపురం నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్టు తెలిపారు. అయితే తనకు అంత తీరిక లేదని, అయినా తాను ఎంత మందికి వ్యతిరేకంగా పోటీ చేయగలను అని నిట్టూర్చారు. ప్రస్తుతానికి తాను విశాఖ ఎంపీ స్థానానికి పోటీ పడుతున్నందున.. పిఠాపురంలో మాత్రం పవన్ ఓటమికోసం ప్రచారం చేస్తాని వారికి మాటిచ్చారట. గతంలో చిరంజీవిని ఓడించినట్టే ఇప్పుడు పవన్ కల్యాణ్ ని కూడా ఓడిస్తానని చెప్పారు పాల్. ప్రజలకు బుద్ధి ఉంటే పవన్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని సెలవిచ్చారు.

అప్పట్లో అలా..

అప్పట్లో తాను పాలకొల్లు వెళ్లి చిరంజీవికి వ్యతిరేకంగా ప్రచారం చేశానని, అందుకే ఆయన అక్కడ ఓడిపోయారని చెప్పారు కేఏపాల్. అయితే తిరుపతిలో చిరంజీవి గెలవడంపై కూడా పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఫ్లైట్ మిస్ కావడం వల్ల తిరుపతి వెళ్లే అవకాశం కోల్పోయానని, లేకపోతే అక్కడ కూడా చిరంజీవిని ఓడించేవాడినని అన్నారు. తాను తిరుపతి వెళ్లకపోవడం వల్ల అక్కడ చిరంజీవి గెలవగలిగారని చెప్పుకొచ్చారు పాల్. ఈసారి మాత్రం తాను కచ్చితంగా పిఠాపురంలో పవన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తేల్చి చెప్పారు. మరి పాల్ వ్యతిరేక ప్రచారం పవన్ విజయావకాశాలను ఏమేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News