తప్పు మీదే, కాదు మీదే.. జనసేన వర్సెస్ ఏపీ పోలీస్..

విశాఖ ఎయిర్ పోర్ట్ దాడి ఘటనలో మొత్తం 6 కేసులు నమోదయ్యాయని, ఇప్పటి వరకు 100మందిని అరెస్ట్ చేశామని చెప్పారు సిటీ కమిషనర్ శ్రీకాంత్. మరో 82మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు.

Advertisement
Update: 2022-10-24 02:19 GMT

విశాఖ ఎయిర్ పోర్ట్ లో మంత్రుల కాన్వాయ్ పై జరిగిన రాళ్లదాడికి బాధ్యులెవరు..? పోలీసులు జనసేన నాయకులపై కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు. కానీ ఆరోజు అసలు తప్పు మాది కాదని వారు వాదిస్తున్నారు. తప్పంతా పోలీసులదేనని, కావాలనే గందరగోళం సృష్టించి తమ పార్టీ నేతల్ని ఇరికించారని, ఇది వైసీపీ పన్నాగం అంటున్నారు. సోషల్ మీడియాలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తప్పుమాదికాదు, జనసేన నాయకులదేనని తేల్చి చెప్పారు.

పథకం ప్రకారమే దాడి..!

ఆరోజు పథకం ప్రకారమే మంత్రులు, ప్రజా ప్రతినిధులపై దాడి జరిగినట్టు తమ విచారణలో తేలిందని చెప్పారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్. మంత్రి రోజాపై దాడి చేయబోగా ఆమె అసిస్టెంట్ దిలీప్‌ కుమార్‌ కి గాయమైందని, అదే సమయంలో పెందుర్తి సీఐ నాగేశ్వరరావు కూడా గాయపడ్డారని తెలిపారు. జనసేన నాయకుల అత్యుత్సాహం వల్ల 30మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని పోలీసులు వివరించారు. పవన్ కల్యాణ్ ప్రయాణం 3 గంటలు ఆలస్యం కావడం వల్లే ఆలోగా మంత్రులు విమానాశ్రయానికి వచ్చారని, అందుకే ఇదంతా జరిగిందన్నారు.

నగరం విడిచి వెళ్లాలనలేదు..

పవన్ కల్యాణ్ కు పోలీసులు నోటీసులిచ్చిన క్రమంలో ఆయన్ను ఆరోజు సాయంత్రం 4గంటల లోగా నగరం విడిచి వెళ్లాలని చెప్పినట్టు కూడా వార్తలొచ్చాయి. కానీ పవన్ మరుసటి రోజు వరకు విశాఖలోనే ఉన్నారు. పోలీసులు చెప్పినా పవన్ వెళ్లలేదని, అది ఆయన ధైర్యమంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారు జనసైనికులు. వీటిపై కూడా కమిషనర్ వివరణ ఇచ్చారు. నగరం విడిచి వెళ్లాలంటూ పవన్ కి నోటీసులివ్వలేదని పేర్కొన్నారు. అదంతా తప్పుడు ప్రచారం అన్నారు.

6 కేసులు 100మంది అరెస్ట్..

విశాఖ ఎయిర్ పోర్ట్ దాడి ఘటనలో మొత్తం 6 కేసులు నమోదయ్యాయని, ఇప్పటి వరకు 100మందిని అరెస్ట్ చేశామని చెప్పారు సిటీ కమిషనర్ శ్రీకాంత్. మరో 82మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. సోషల్ మీడియా పోస్టింగ్ ల పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ విషయంలో పోలీసులు తమ పరిధిలోనే వ్యవహరించారని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినవారికి కూడా నోటీసులిస్తామన్నారు.

Tags:    
Advertisement

Similar News