86 నియోజకవర్గాలనే పవన్ టార్గెట్ చేస్తున్నారా?

మొత్తం 175 నియోజకవర్గాలపైన దృష్టి పెట్టే బదులు తమ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్రపైన దృష్టి కేంద్రీకరిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని పవన్ అనుకున్నట్లున్నారు.

Advertisement
Update: 2022-11-25 05:01 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ప్రకటన చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం మొదలైంది. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలని పవన్ చెప్పిన మాట కరెక్టే కానీ అంతర్లీనంగా పై ప్రాంతాల్లోనే కాపులు/బలిజలు ఎక్కువగా ఉన్న విషయం గమనార్హం. మొదటి నుండి కూడా పవన్‌కు పై రెండుప్రాంతాల్లోనే ఎక్కువ ఆదరణ ఉంది.

పోయిన ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పవన్ ఓడిపోయినా భీమవరం కన్నా విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గంలోనే ఎక్కవ ఓట్లొచ్చాయి. రాయలసీమలో 52, ఉత్తరాంధ్రలో 34 కలిపి 86 నియోజకవర్గాలున్నాయి. పోయిన ఎన్నికల్లో జనసేనకు ఉత్తరాంధ్రలోని కొన్ని నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ ఓట్లే వచ్చాయి. ఇక కోస్తా, ఉభయగోదావరి జిల్లాల్లో జనసేనకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే కోస్తాలోని ఆరు జిల్లాల్లోనూ కాపులున్నప్పటికీ ఇతర సామాజిక వర్గాలు కూడా బలంగా ఉన్నాయి.

అందుకనే మొత్తం 175 నియోజకవర్గాలపైన దృష్టి పెట్టే బదులు తమ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్రపైన దృష్టి కేంద్రీకరిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని పవన్ అనుకున్నట్లున్నారు. ఇందులో భాగంగానే పై రెండు ప్రాంతాల్లోనే పవన్ ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఉత్తరాంధ్రలో కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ సామాజిక వర్గాలు కూడా ఉన్నా రాజకీయంగా ప్రభావం తక్కువనే చెప్పాలి. మెజారిటి సామాజికవర్గాలు కాపులు, బీసీలే.

అలాగే రాయలసీమలో రెడ్డి, కమ్మ, ఎస్సీ సామాజికవర్గాలు రాజకీయంగా ప్రభావం చూపిస్తున్నా జనాభాతో పాటు రాజకీయంగా కూడా కాపులు బలంగా ఉన్నారు. ఇక కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రాజకీయంగా కాపుల ప్రభావం తక్కువనే చెప్పాలి. ఇక్కడ రెడ్లు, కమ్మలు, ఎస్సీల ప్రభావం ఎక్కువ. మిగిలిన ఉభయగోదావరి జిల్లాల్లో కాపులు బలంగానే ఉన్నప్పటికీ వీళ్ళకి ధీటుగా బీసీలూ ఉన్నారు. కాపులకు, బీసీలకు బద్ధ విరోధముంది. పైగా కాపులకు ఎక్కడికక్కడ బీసీలు బ్రేకులేస్తుంటారు. అందుకనే వ్యూహాత్మకంగానే పవన్ రాయలసీమ, ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టినట్లున్నారు. మరి పవన్ వ్యూహం ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News