సీఎం సభ పక్కనే గుట్టలుగా నల్ల చున్నీలు.. ఎందుకంటే..?

నరసాపురంలో సీఎం జగన్ సభకు వచ్చిన వారిని నల్లబట్టలు వేసుకున్నారన్న కారణంగా ఆపేశారు. చివరకు మహిళలు తమ నల్ల చున్నీలు తీసి పక్కనపెట్టిన తర్వాతే వారిని లోపలికి అనుమతించారు.

Advertisement
Update: 2022-11-21 12:26 GMT

ఆమధ్య తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ సభకు వచ్చిన అయ్యప్ప మాల ధరించిన స్వాముల్ని నల్లబట్టలు వేసుకున్నారనే కారణంతో లోపలికి అనుమతించలేదు బీజేపీ నేతలు. నల్ల చొక్కాలతో నిరసన ప్రదర్శన చేపడతారేమోనని అనుమానించి వారిని అవమానించారు. సరిగ్గా ఇప్పుడు ఏపీలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. నరసాపురంలో సీఎం జగన్ సభకు వచ్చిన వారిని ఇలానే నల్లబట్టలు వేసుకున్నారన్న కారణంగా ఆపేశారు. చివరకు మహిళలు తమ నల్ల చున్నీలు తీసి పక్కనపెట్టిన తర్వాతే వారిని లోపలికి అనుమతించారు.

విధిలేని పరిస్థితుల్లో విధులకు..

తెలంగాణ మోదీ సభను చూడటానికి వచ్చిన అయ్యప్ప స్వాములు సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద అవమానంతో వెనుదిరిగారు. కానీ ఇక్కడ ఏపీలో సీఎం జగన్ సభ విషయంలో మహిళలు వెనక్కు వెళ్లే ఛాన్స్ లేకుండా పోయింది. నల్ల చున్నీలతో వచ్చిన కొంతమంది మహిళా ఉద్యోగులు లోపలికి వెళ్లి విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. దీంతో వారంతా విధిలేక తమ చున్నీలు బయట గుట్టగా పోసి లోపలికి వెళ్లారు. తాము ఉద్యోగులమని, సభా వేదిక వద్ద విధుల్లో పాల్గొనేందుకు వచ్చామని చెప్పినా సెక్యూరిటీ పట్టించుకోలేదు. లోపలికి వెళ్లాలంటే నల్ల చున్నీ తొలగించాల్సిందేనన్నారు. దీంతో మహిళా ఉద్యోగులు తమ చున్నీలు బయటే వదిలేసి వెళ్లారు.

నల్ల చున్నీలు, స్కార్ఫ్ లు అక్కడ గుట్టగా పోగయ్యే సరికి టీడీపీ అనుకూల మీడియా ఆ విషయాన్ని హైలెట్ చేసింది. సీఎం జగన్ సభలో మహిళలకు అవమానం అంటూ వార్తలిచ్చింది. దీనిపై ప్రభుత్వం తరపున ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు. వీడియో సాక్ష్యాలతో సహా సెక్యూరిటీ నిర్వాకం బయటపడింది. దీన్ని కవర్ చేసుకోడానికి ఎవరూ సాహసించట్లేదు. నిజంగానే నల్ల చున్నీలతో సభా ప్రాంగణంలోకి మహిళలు వెళ్తే ఏమవుతుంది. నల్ల చున్నీలు, నల్ల బెలూన్లకి నిజంగానే నాయకులు అంతగా భయపడుతున్నారా, లేక పోలీసుల అత్యుత్సాహం వల్లే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయా..?

Advertisement

Similar News