దర్శనం టికెట్ ఉన్నవారే తిరుమలకు రండి.. టీటీడీ అభ్యర్థన

శనివారం ఉన్న పరిస్థితిని చూస్తే టోకెన్లు లేకుండా క్యూలైన్లో వేచి చూస్తున్న భక్తులకు శ్రీవారి దర్శనమయ్యే సరికి 30గంటలు సమయం పట్టే అవకాశముందని అంచనా.

Advertisement
Update: 2023-04-09 01:30 GMT

తిరుమల కొండకు హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టేశారు. వేసవి సెలవలు ఇంకా ప్రారంభం కాకముందే తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగింది. వారాంతంలో వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో భక్తులు కొండకు పోటెత్తారు. శుక్రవారం మొదలైన రద్దీ శనివారం కూడా కొనసాగింది. ఆదివారం కూడా ఇదే రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకే దర్శనం టికెట్లు ఉన్నవారు మాత్రమే తిరుమలకు రావాలని సూచిస్తున్నారు.

టైమ్ స్లాట్ టోకెన్లు లేనివారిని కూడా సర్వదర్శనం క్యూలైన్లోకి అనుమతిస్తున్న నేపథ్యంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. ఇటీవల కాలి నడక భక్తులకు కూడా దర్శనం టోకెన్లు ఇస్తున్నారు. దీంతో ఇటు అలిపిరి, అటు శ్రీవారి మెట్టు వద్ద కూడా రద్దీ బాగా పెరిగిపోయింది.

దర్శనానికి 30గంటల సమయం..

శనివారం ఉన్న పరిస్థితిని చూస్తే టోకెన్లు లేకుండా క్యూలైన్లో వేచి చూస్తున్న భక్తులకు శ్రీవారి దర్శనమయ్యే సరికి 30గంటలు సమయం పట్టే అవకాశముందని అంచనా. రద్దీ నేపథ్యంలో రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం, టైమ్ స్లాట్ సర్వ దర్శనం, దివ్య దర్శనం టోకెన్లు ఉన్నవారు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. గదుల కేటాయింపు కేంద్రాల వద్ద భక్తుల రద్దీ బాగా పెరిగింది.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే తిరుమలలో రద్దీ మరింతగా పెరుగుతుంది. ఆ తర్వాత వెంటనే వేసవి సెలవలతో విద్యార్థులు, మొక్కు చెల్లించుకునేవారు తిరుమలకు పోటెత్తుతారు. రద్దీ ఊహించినదే అయినా ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. 

Tags:    
Advertisement

Similar News