ప్రజారాజ్యానికి మొదటి చేటు పవన్ కల్యాణే

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడానికి మొదటి కారణం పవన్ కల్యాణే అని అన్నారు వెల్లంపల్లి. ఎమ్మెల్యేలంతా చివరి వరకు చిరంజీవితోనే ఉన్నారని గుర్తుచేశారు.

Advertisement
Update: 2022-08-23 14:08 GMT

ఇటీవల ఏపీ రాజకీయాల్లో ప్రజారాజ్యం హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి పెట్టిన ఆ పార్టీని అప్పట్లో కాంగ్రెస్ లో విలీనం చేశారు, ఆ తర్వాత నాయకులు చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. చివరకు చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు. కానీ ఆనాటి పరిణామాలకు, ఈనాటి వైసీపీలోని కొందరు సీనియర్ నేతలు కారణం అంటూ పవన్ కల్యాణ్ విమర్శలు మొదలు పెట్టారు. ప్రజారాజ్యం అర్థాంతరంగా అంతర్థానం కావడానికి ఆ కోవర్టులే కారణం అంటూ దుయ్యబట్టారు. దీంతో అనుకోకుండానే పవన్, మాజీ ప్రజారాజ్యం నేతలకు టార్గెట్ అయ్యారు. అసలు ప్రజారాజ్యానికి మొదటి శత్రువు పవన్ కల్యాణే అంటున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

ఆనాడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్టు పవన్ కల్యాణే అని అన్నారు వెల్లంపల్లి. పార్టీ 18 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం కాగానే, అది గిట్టుబాటు కాదని పవన్ బయటకు వెళ్లిపోయారని, అప్పటి వరకు యువరాజ్యం అంటూ బడాయి పోయిన పవన్, ప్రజారాజ్యం అధికారంలోకి రాలేదని తేలిపోవడంతో పార్టీని వదిలేశారన్నారు. యువరాజ్యం అధినేతగా ఆయన ఏం పీకాడని కాస్త ఘాటుగా మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడానికి మొదటి కారణం పవన్ కల్యాణే అని అన్నారు వెల్లంపల్లి. ఎమ్మెల్యేలంతా చివరి వరకు చిరంజీవితోనే ఉన్నారని గుర్తుచేశారు. అందులో తానూ ఉన్నానని, అది తమ నిబద్ధతకు నిదర్శనం అని చెప్పారు.

చిరంజీవిని జగన్ అవమానించారని అనడం పవన్ అవివేకానికి నిదర్శనం అన్నారు వెల్లంపల్లి. సినిమా ఫంక్షన్లలో చిరంజీవిని అవమానించే విధంగా వ్యవహరించింది పవన్ కల్యాణేనని చెప్పారు. చిరంజీవి లేకపోతే పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నాడని నిలదీశారు. జగన్, చిరంజీవికి మధ్య గ్యాప్ సృష్టించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ కి సీఎం కావాలని, కాపు వర్గానికి అండగా నిలబడాలనే ఉద్దేశాలు లేవని, ఆయన కేవలం చంద్రబాబుని సీఎం చేయడానికే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

2019లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్, 2024 ఎన్నికల్లో 20 చోట్ల పోటీ చేసినా ఓడిపోవటం ఖాయమని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. కడప జిల్లాకు వెళ్లి సవాళ్లు విసురుతున్న పవన్, కనీసం కడపలో కార్పొరేటర్‌ గా కూడా గెలవలేడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని పేర్కొన్నారు వెల్లంపల్లి. పవన్ కల్యాణ్ తమతో కలిసి ఉంటాడని బీజేపీ నేతలకు నమ్మకం లేదని.. అందుకే వారు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News