జగన్ కి షాకిచ్చిన బాలినేని.. ఏం చేశారంటే..?

సీఎం జగన్ అప్పగించిన పదవిని వద్దని చెప్పే ధైర్యం పార్టీలో ఎవరికీ లేదు. కానీ బాలినేని ఆ విషయంలో తగ్గేలా లేరు.

Advertisement
Update: 2023-04-29 09:36 GMT

వైసీపీలో బాలినేని వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. ఆమధ్య మార్కాపురంలో జగన్ సభ సమయంలో తనకు అవమానం జరిగిందని అలిగి వెళ్లిపోయిన ఆయన.. ఆ తర్వాత ఇప్పటి వరకు కుదురుకోలేదు. ఒకటి రెండుసార్లు ఒంగోలులో జరిగిన మీటింగ్ లకు వెళ్లినా, మీడియాతో మాట్లాడకుండానే మొహం చాటేశారు. తాజాగా ఆయన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఈమేరకు అధిష్టానానికి సమాచారం పంపించారు. హైదరాబాద్ లో ఉన్న ఆయన, తనకు అస్వస్థతగా ఉందని, కొన్నిరోజులు విశ్రాంతి అవసరం అని, అందుకే పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండలేకోపోతున్నానని చెబుతున్నారు.

జగన్ తొలి కేబినెట్ లో బాలినేనికి మంత్రి పదవి ఇచ్చారు కానీ, రెండో దఫా తీసేశారు. ఆ తర్వాత ఆయన అలకబూనారు. తన అసంతృప్తిని జగన్ ముందే వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాల్లో కూడా చురుగ్గా ఉండటం మానేశారు. మళ్లీ ఆయనే అడ్జస్ట్ అయిపోయారు. ఆ తర్వాత మార్కాపురం ఎపిసోడ్ జరిగింది. అసలే మంత్రివర్గంలో తనని తీసేసి, ఆదిమూలపు సురేష్ ని కొనసాగిస్తున్నారనే ఆవేదన ఆయనలో ఉంది. జిల్లా మంత్రిగా ఆదిమూలపు సురేష్ పెత్తనాన్ని బాలినేని భరించలేకపోతున్నారనే ప్రచారం కూడా ఉంది. సడన్ గా ఇప్పుడు ఆయన ఇన్ చార్జ్ పదవి నుంచి తప్పుకోవడంతో ఆ ప్రచారం నిజమని అంటున్నారు.

సీఎం జగన్ అప్పగించిన పదవిని వద్దని చెప్పే ధైర్యం పార్టీలో ఎవరికీ లేదు. కానీ బాలినేని ఆ విషయంలో తగ్గేలా లేరు. తనకు మంత్రి పదవి లేకపోవడం, సీఎం పర్యటనలో అవమానం జరగడం, జిల్లాలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో ఆయన ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది. తాజాగా ఇన్ చార్జ్ పదవికి రాజీనామా చేసిన బాలినేని అధిష్టానంపై మరింత ఒత్తిడి పెంచుతున్నారని అర్థమవుతోంది. మార్కాపురం సభలో బాలినేనిని పిలిచి ఆయనతో ల్యాప్ టాప్ బటన్ ప్రెస్ చేయించిన జగన్, ఈ వ్యవహారాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News