మరి కొద్ది రోజుల్లోనే విశాఖ నుంచి సీఎం జగన్ పాలన : మంత్రి అమర్‌నాథ్

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చడానికి ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.

Advertisement
Update: 2023-03-06 10:47 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం కేంద్రంగా పాలన చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వైజాగ్ కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన ఉండబోతోందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ జగన్ వైజాగ్ నుంచి పాలన చేస్తారని ఢిల్లీలోనే స్వయంగా చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 విజయవంతం కావడంతో వైసీపీ ప్రభుత్వం మరింత ఉత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో తమపై మరింత బాధ్యత పడిందని మంత్రి అమర్‌నాథ్ చెప్పుకొచ్చారు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చడానికి సీఎస్ నేతృత్వంలో ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ఈ ఒప్పందాలన్నిటీనీ వారే సమీక్షించి ప్రతీ వారం రిపోర్టు ఇస్తారని అన్నారు. ఇక వచ్చే నెల నుంచి ఒప్పందాల అమలు ప్రారంభమవుతుందని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతం అయిన తర్వాత కూడా రాజకీయ విమర్శలు చేస్తున్న వాళ్లను తాను ఏమీ అననని.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అమర్ నాథ్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునే.. ఇండస్ట్రియల్ పాలసీని అక్కడ ప్రకటించలేక పోయామని మంత్రి తెలిపారు. ఈ నెల 18 తర్వాత ఇండస్ట్రియల్ పాలసీని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

డిసెంబర్ 23 నాటికి రామాయపట్నం పోర్టు కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని మంత్రి చెప్పారు. అదే రోజు తొలి వెసల్ (ఓడ) పోర్టుకు రానున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సీఎం జగన్ బ్రాండ్.. ఆయన ఆత్మవిశ్వాసం పారిశ్రామిక వేత్తలను ఏపీ వైపు ఆకర్షించేలా చేశాయన్నారు. వైఎస్ జగన్ పరిపాలన వైజాగ్ నుంచే కొనసాగినా.. సుప్రీంకోర్టులో ఉన్న కేసు తీర్పుకు అనుగుణంగానే తర్వాత నిర్ణయం ఉంటుందని అన్నారు. తీర్పు ఆలస్యం అయితే జగన్ కేవలం క్యాంపు కార్యాలయం ప్రారంభించి.. అక్కడి నుంచి పాలన మొదలు పెడతారని అన్నారు. అయితే, కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నట్లు మంత్రి అభిప్రాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News