జగన్ చొరవతో ఇంద్రకీలాద్రి దశ మారేనా..?

అభివృద్ధికోసం నిధులు ఖర్చు చేస్తున్నారు సరే.. తిరుమలలో ఉన్నట్టు పగడ్బందీ వ్యవస్థను ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దర్శనాలు, క్యూలైన్లు, పారిశుధ్య నిర్వహణ విషయంలో కూడా తీవ్ర విమర్శలున్నాయి.

Advertisement
Update: 2023-12-07 06:33 GMT

ఏపీలో తరచూ వార్తల్లోకెక్కే ఆలయం బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం. కొండ చరియలు విరిగిపడ్డాయని, నకిలీ టికెట్లతో దర్శనాలు జరుగుతున్నాయని, అమ్మవారి చీరలు అక్రమంగా అమ్ముకుంటున్నారని, భవానీ భక్తులు ఇబ్బంది పడుతున్నారని.. ఇలా రకరకాలుగా ఈ ఆలయం చుట్టూ వివాదాలు ముసురుతూనే ఉంటాయి. టీడీపీ హయాంలో ఏకంగా క్షుద్రపూజల కలకలం రేగింది. ప్రభుత్వాలు మారినా దుర్గగుడి వ్యవహారంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలేవీ జరగలేదనే విమర్శ కూడా ఉంది. వీటన్నిటికీ సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. దుర్గగుడిపై రూ. 216 కోట్లతో చేపట్టబోతున్న అభివృద్ధి పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు.

రూ. 57 కోట్లతో అన్నప్రసాద భవన నిర్మాణం ఇక్కడ మొదలవుతుంది. రూ.27కోట్లతో ప్రసాదం పోటు భవనం కూడా నిర్మించబోతున్నారు. ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌, మెట్లు, దక్షిణంవైపు అదనపు క్యూ కాంప్లెక్స్‌, మహారాజ ద్వార నిర్మాణం, మల్లికార్జున మహా మండపం వద్ద క్యూ కాంప్లెక్స్‌ మార్పు, నూతన కేశఖండన శాల, గోశాల విస్తరణ వంటి కార్యక్రమాలకు ఈరోజు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు, ప్యానల్‌ బోర్డుల ఏర్పాటు, వాటర్‌ మేనేజ్‌ మెంట్‌ పనులు పూర్తి కాగా వాటిని సీఎం జగన్ ప్రారంభించారు.

అభివృద్ధికోసం నిధులు ఖర్చు చేస్తున్నారు సరే.. తిరుమలలో ఉన్నట్టు పగడ్బందీ వ్యవస్థను ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. పవిత్ర కృష్ణానది తీరంలో వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిని పర్యాటకంగా మరింతగా అభివృద్ధి చేసే అవకాశముంది. వివిధ పనులకోసం బెజవాడకు వచ్చినవారు కచ్చితంగా ఆలయానికి రావాలనుకుంటారు. కానీ ఇక్కడికి వస్తే మాత్రం అసంతృప్తితోనే వెనుదిరుగుతారు. పుష్కరాల సమయంలో మాత్రమే ఘాట్ లు సుందరంగా మారతాయి, ఆ తర్వాత వాటిని పట్టించుకునేవారు ఉండరు. దర్శనాలు, క్యూలైన్లు, పారిశుధ్య నిర్వహణ విషయంలో కూడా తీవ్ర విమర్శలున్నాయి. వీటన్నిటినీ సరిచేయడానికి సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నం సఫలమవుతుందేమో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News