జనసేనను తొక్కేయడానికి చంద్రబాబు పక్కా ప్లాన్‌..?

జనసేనకు కేవలం 25 సీట్లు మాత్రమే చంద్రబాబు కేటాయిస్తారని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఎల్లో ప‌త్రిక‌లు, టీవీ ఛానళ్లు కూడా తీరిక లేకుండా ఇదే అంశాన్ని ప్రసారం చేస్తున్నాయి.

Advertisement
Update: 2024-02-05 12:02 GMT

పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలోని జనసేన పార్టీని తొక్కేయడానికి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్లాన్‌ సిద్ధం చేసి అమలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేనకు 30 సీట్ల లోపు కేటాయించి భవిష్యత్తులో ఆ పార్టీ పుంజుకోకుండా చేయడమే ఆయన ప్లాన్‌లోని ఆంతర్యమని కాపు సామాజిక వర్గం అభిప్రాయపడుతోంది. అందుకే కాపు పెద్ద హరిరామ జోగయ్య పవన్‌ కల్యాణ్‌ను నిలదీస్తూ బ‌హిరంగ లేఖ రాశారని అంటున్నారు.

జనసేనకు కేవలం 25 సీట్లు మాత్రమే చంద్రబాబు కేటాయిస్తారని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఎల్లో ప‌త్రిక‌లు, టీవీ ఛానళ్లు కూడా తీరిక లేకుండా ఇదే అంశాన్ని ప్రసారం చేస్తున్నాయి. దీనికి జనసేన నుంచి కనీసం ఖండన కూడా లేదు. అంటే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అందుకు అంగీరించినట్లు ప్రజల్లోకి సంకేతాలు వెళ్తాయి. ఎన్ని సీట్లు ఇచ్చినా సరే అనేలా వ్యవహరిస్తే పవన్‌ కల్యాణ్‌ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పిదం అవుతుందని అంటున్నారు.

గతంలో మిత్రపక్షాలకు 15, 20, 30 సీట్లు ఇచ్చి ఎదగకుండా ఆ పార్టీలను చంద్రబాబు తొక్కేసిన అనుభవం ఉందని, అందువల్ల 20, 25 సీట్లు ఇస్తే చంద్రబాబును నమ్మడం అంటే తామే కత్తి ఇచ్చి గొంతు కోయాలని చెప్పినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒకప్పుడు బలంగా ఉన్న వామపక్షాలు చివరకు నిర్జీవమై, ఒకటి రెండు సీట్ల కోసం ప్రధాన పార్టీల చుట్టూ తిరిగే పరిస్థితిని కల్పించుకున్నాయి. టీడీపీని నమ్మి కొద్దిసీట్లకు పవన్‌ కల్యాణ్‌ అంగీకరిస్తే తర్వాతి కాలంలో జనసేన తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News