జనసేనకు ఇచ్చే సీట్లు ఫైనలయ్యాయా?

జనసేన 60 సీట్లు కావాలని పట్టుబడుతోందట.. అయితే అన్నిసీట్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. కాబట్టి కాస్త అటుఇటుగా ఓ 45 సీట్లను వదులుకోక తప్పేట్లు లేదని చంద్రబాబు పరోక్షంగా కొందరు తమ్ముళ్ళకి హింట్ ఇచ్చారట.

Advertisement
Update: 2022-10-06 07:13 GMT

అవుననే అంటున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేయటం దాదాపు ఖాయమేనని పార్టీ నేతలే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న భయమే రెండు పార్టీలను ఏకం చేస్తున్నాయట. వీళ్ళతో పాటు బీజేపీ ఉంటుందా.. ఉండదా అన్న విషయంలో క్లారిటి లేదు. పొత్తుల్లో భాగంగా జనసేనకు 35-45 అసెంబ్లీ సీట్లు ఇవ్వటం ఖాయమని సీనియర్ తమ్ముళ్ళ సమాచారం. ప్రతి జిల్లాలోను కనీసం రెండు అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంద‌ని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారట.

ప్రతి జిల్లాలో రెండు సీట్లన్నది కూడా ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోనే ఉంటుందని టీడీపీలో చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో 4 పార్లమెంటు సీట్లలో జనసేన పోటీచేస్తుందని సీనియర్ తమ్ముడొకరు చెప్పారు. అంటే ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే. ఎందుకంటే జనసేన 60 సీట్లు కావాలని పట్టుబడుతోందట. అయితే అన్నిసీట్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. కాబట్టి కాస్త అటుఇటుగా ఓ 45 సీట్లను వదులుకోక తప్పేట్లు లేదని చంద్రబాబు పరోక్షంగా కొందరు తమ్ముళ్ళకి హింట్ ఇచ్చారట.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కృష్ణా జిల్లాలో అన్నీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను దాదాపు ఖరారు చేసిన చంద్రబాబు గుడివాడ, అవనిగడ్డ మాత్రం పెండింగ్ పెట్టారట. అలాగే అనంతపురం జిల్లాలో కొన్నినియోజకవర్గాలను ఖరారుచేసి అనంతపురం అర్బన్, మడకశిర నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టారని తమ్ముళ్ళు చెబుతున్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో నెలల తరబడి పార్టీ ఇంచార్జుల‌ను నియమించటం లేదట.

నియోజకవర్గాల సమీక్షల సందర్భంగా చంద్రబాబు మాటలు, ఇంచార్జుల‌ నియామకాల విషయంలో జరుగుతున్న కసరత్తు చూసిన తర్వాత జనసేన, టీడీపీ పొత్తు ఖాయమనే తమ్ముళ్ళు నిర్ధారణకొచ్చారు. అయితే ఇక్కడే ఒక సమస్య తమ్ముళ్ళని వెంటాడుతోంది. అదేమిటంటే నియోజకవర్గాల ఇంచార్జుల‌ను నియమించకుండా, టికెట్ ఖాయం చేయకుండా నియోజకవర్గాల్లో గట్టిగా పనిచేయాలని చంద్రబాబు పదే పదే తమ్ముళ్ళ వెంటపడుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చులు చేసుకున్న తర్వాత నియోజకవర్గాన్ని పొత్తులో ఇంకో పార్టీకి ఇచ్చేస్తే అప్పుడు తామేం చేయాలన్నది తమ్ముళ్ళ సమస్య.

Tags:    
Advertisement

Similar News