పవన్ అడిగినా ఎవరూ మాట్లాడలేదట

పవన్ మీటింగ్ పెట్టడానికి ముందురోజే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా చాలామందిని పిలిపించారట. ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండోసారి తనను గెలిపించేందుకు సహకరించాలని రిక్వెస్టు చేసుకున్నారట.

Advertisement
Update: 2024-02-27 06:02 GMT

రాబోయే ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ప్రచారం అని అన్నది ఎందుకంటే.. ఈ విషయాన్ని పవన్ ఇంతవరకు బహిరంగంగా ప్రకటించలేదు కాబట్టి. కాకపోతే భీమవరం పర్యటనలో పవన్ టీడీపీ నేతల ఇళ్ళకు వెళ్ళి తనకు మద్దతు ఇవ్వాలని అడిగారు. దాంతో పవన్ భీమవరంలో పోటీచేస్తారనే ప్రచారం పెరిగిపోయింది. అయితే ఇదే సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. అదేమిటంటే.. టీడీపీ నేతలతో భేటీ ముగిసిన‌ తర్వాత పట్టణంలోని కొందరు వర్తక ప్రముఖులను పిలిపించి మాట్లాడారట.

రాబోయే ఎన్నికల్లో భీమవరంలో జనసేన గెలిపించేందుకు మద్దతు ఇవ్వమని రిక్వెస్టు చేసుకున్నారట. అయితే జనసేన అభ్యర్థి అంటే ఎవరు పోటీచేస్తున్నారని ప్రముఖులు అడిగారట. దానికి పవన్ సూటిగా సమాధానం చెప్పలేదని తెలిసింది. ఎవరు పోటీచేసినా సరే తమ పార్టీకి మద్దతివ్వాలని మాత్రమే పవన్ అడిగారట. అందుకు సదరు ప్రముఖులు ఏమీ సమాధానం చెప్పకుండానే అక్కడినుండి వెళ్ళిపోయార‌ని తెలిసింది.

అయితే పవన్ మీటింగ్ పెట్టడానికి ముందురోజే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా చాలామందిని పిలిపించారట. ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండోసారి తనను గెలిపించేందుకు సహకరించాలని రిక్వెస్టు చేసుకున్నారట. పవన్ పోటీచేస్తారనే ప్రచారాన్ని గ్రంధి ప్రస్తావించారట. రేపు ఏదైనా సమస్య వస్తే నియోజకవర్గంలో అండగా నిలబడేది తానే కానీ, పవన్ కాదన్నారట. వచ్చేఎన్నికల్లో పవన్ను గెలిపిస్తే ఏదైనా సమస్యవస్తే ఎక్కడుంటారని వెళ్ళి కలుస్తారా అని గ్రంధి సూటిగానే ప్రశ్నించారట. 365 రోజులు సినిమా షూటింగుల్లో బిజీగా ఉండే పవన్ను గెలిపిస్తే ఎవరికీ అందుబాటులో ఉండరన్న విషయాన్ని నొక్కిచెప్పారట.

24 గంటలూ, 365 రోజులు జనాలకు అందుబాటులో ఉండే తనకు మద్దతిస్తే ఏ సమస్య వచ్చినా అందుబాటులోనే ఉంటున్న విషయాన్ని అందరికీ గ్రంధి గుర్తుచేశారట. అప్పట్లో భీమవరంలో ఓడిపోయిన తర్వాత ఇక నుండి నియోజకవర్గంలో రెగ్యులర్ గా పర్యటిస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని పవన్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారట. అలాచెప్పిన పవన్ గడచిన ఐదేళ్ళలో భీమవరం పట్టణానికి వచ్చింది మూడుసార్లు మాత్రమే అని చెప్పారట. ఎమ్మెల్యే మీటింగ్ పెట్టి మద్దతు అడిగిన మరుసటి రోజే పవన్ కూడా మీటింగ్ పెట్టి మద్దతు అడగటంతో ఏమిచెప్పాలో అర్థంకాక ప్రముఖులు మౌనంగానే వెళ్ళిపోయారట. మరి చివరకు ఎవరికి మద్దతిస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News