మీరూ మీరూ కొట్టుకుంటే మా సంగతేంటి..?

ఆరు నూరైనా పోలవరం నిర్మించి తారతామంటూ ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఏపీలో సోము వీర్రాజు కూడా పోలవరంపై ఏకంగా ప్రెస్ మీట్ పెట్టారు.

Advertisement
Update: 2022-07-21 07:44 GMT

గోదావరి వరదల తర్వాత ముంపు గ్రామాల విలీన అంశంతోపాటు, పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతున్నారని, ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణ ప్రాంతం నష్టపోతుందని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై వైసీపీ నేతలు కూడా దీటుగా బదులిచ్చారు. పోలవరం ఎత్తు పెంచట్లేదని, కేంద్రం నిర్ణయం ప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతోందన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే ఈ విషయంలో తమకేం రాజకీయ లాభం లేదనుకుంటూ దిగాలుగా ఉన్న బీజేపీ కాస్త ఆలస్యంగా ఎంటరైంది. ఆరు నూరైనా పోలవరం నిర్మించి తారతామంటూ ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఏపీలో సోము వీర్రాజు కూడా పోలవరంపై ఏకంగా ప్రెస్ మీట్ పెట్టారు.

పోలవరం అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర జరుగుతోందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. పోలవరాన్ని ప్రశ్నిస్తే.. తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లేనని చెప్పారాయన. పోలవరం గురించి ప్రశ్నిస్తే.. రాష్ట్ర విభజన అంశాన్ని తిరగతోడినట్లేనన్నారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలని చెప్పారు. అక్కడితో ఆగలేదు, రాష్ట్ర విభజనపై పూర్తిగా అధ్యయనం చేసిన ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు.

పోలవరం ఆలస్యం కావడానికి కేంద్రానిదేం తప్పులేదంటూ కవర్ చేసుకున్నారు సోము వీర్రాజు. చంద్రబాబు, జగన్ ప్రజల్ని మోసం చేశారని, పోలవరం ఆలస్యానికి కారణం వారిద్దరేనంటూ మండిపడ్డారు. లోయర్ కాపర్ డ్యాం పాడైన విషయంపై అధ్యయనం జరుగుతోందన్నారు వీర్రాజు.

మొత్తమ్మీద పోలవరం విషయంలో ఇక్కడ ఏపీ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కచ్చితంగా అక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ రియాక్ట్ అవుతుంది. దీంతో ఈ వివాదంలో బీజేపీ ఎంటరైనట్టవుతుంది. అధిష్టానం సలహా ఇచ్చిందో లేక ఏపీ బీజేపీ నేతలకు ఈ ఆలోచన తట్టిందో తెలియదు కానీ, పోలవరంలో మమ్మల్ని కూడా కాస్త గుర్తించండి అంటూ మీడియా ముందుకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News