ఏపీ రాజకీయ పక్షాలది బాధ్యతారాహిత్యం - రొయ్యల ఎగుమతి దారుల సంఘం

రొయ్యల పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం చక్కటి సహాయ, సహకారాలు అందిస్తోందని.. భాగస్వాములతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోందని తన ప్రకటనలో రొయ్యల ఎగుమతిదారుల సంఘం వివరించింది

Advertisement
Update: 2022-11-17 04:26 GMT

ఏపీలో ఆక్వా రంగంపై కొన్ని రాజకీయ పక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అఖిల భారత రొయ్యల ఎగుమతి దారుల సంఘం అభ్యంతరం తెలిపింది. రైతులు, వ్యాపారులు, ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించేందుకు కొన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తున్నాయని సంఘం ఆరోపించింది. రొయ్యల ధర పడిపోవడంతో రైతులు పంట విరామం ప్రకటిస్తున్నారంటూ కొన్ని పత్రికలు, చానళ్లు అసత్యవార్తలను ప్రచారం చేస్తున్నాయని వాటిని ఖండిస్తున్నట్టు ప్రకటించింది. రాజకీయ పక్షాల తీరు బాధ్యతారాహిత్యంగా ఉందని విమర్శించింది.

రొయ్యల పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం చక్కటి సహాయ, సహకారాలు అందిస్తోందని.. భాగస్వాములతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోందని తన ప్రకటనలో రొయ్యల ఎగుమతిదారుల సంఘం వివరించింది. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిందని.. ఉప సంఘం చర్చల ఫలితంగానే మేత ఉత్పత్తిదారులు మేతపై టన్నుకు 2600 రూపాయలను వెంటనే తగ్గించారని వివరించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యల ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయని.. అందుకే రైతులు, ఎగుమతిదారులు చర్చించుకుని ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన ధరను నిర్ణయించినట్టు సంఘం చెబుతోంది. రైతులకు న్యాయమైన ధరను చెల్లించే రొయ్యల కొనుగోలు జరుగుతోందని..మేత ధరల నియంత్రణ, రొయ్యల ధరల నిర్ణయంలో ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని.. కాబట్టి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని రొయ్యల ఎగుమతిదారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఆక్వా రంగం అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చే సలహాలు, సూచనలు, ఆదేశాలను పాటిస్తామని సంఘం తన ప్రకటనలో వివరించింది.

Tags:    
Advertisement

Similar News