అద్నాన్ సమీకి మంత్రుల స్ట్రాంగ్ కౌంటర్

అద్నామ్ సమీ చేసిన విమర్శలకు వైసీపీ మంత్రులు, ఎంపీలు గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఏపీ మంత్రి విడదల రజిని గాయకుడు సమీ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ట్విట్టర్ వేదికగా గాయకుడికి గట్టి కౌంటర్ ఇచ్చారు మహిళా మంత్రి.

Advertisement
Update: 2023-01-12 06:26 GMT

అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ పై బాలీవుడ్ గాయకుడు అద్నామ్ సమీ చేసిన విమర్శలకు వైసీపీ మంత్రులు, ఎంపీలు గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఏపీ మంత్రి విడదల రజిని గాయకుడు సమీ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ట్విట్టర్ వేదికగా గాయకుడికి గట్టి కౌంటర్ ఇచ్చారు మహిళా మంత్రి.

అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు ఒక తెలుగు చిత్రానికి దక్కడం తెలుగు వారికి గర్వకారణమని, ప్రపంచ వేదికపై తెలుగు జెండా రెపరెపలాడుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలుత ట్విట్టర్లో అభినందించారు.

జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రశంసపై బాలీవుడ్ గాయకుడు అద్నామ్ సమీ ఈకలు పీకే పని మొదలుపెట్టారు. తెలుగు జెండా అంటూ ముఖ్యమంత్రి పదప్రయోగం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. మనమందరం భారతీయులమని ఒక ప్రాంతాన్ని మిగిలిన దేశం నుంచి విడదీయవద్దని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేర్పాటువాద వైఖరిని అనుసరిస్తున్నారని, పెద్ద పెద్ద మాటలు వాడేశారు. తెలుగు జెండానా..? భారత జెండానా..? అంటూ ప్రశ్నించారు. దయతో మిమ్మల్ని మిగిలిన దేశం నుంచి వేరు చేసుకోవద్దని.. మరీ ముఖ్యంగా అంతర్జాతీయంగా చూసినప్పుడు మనది అంతా ఒకే దేశం అంటూ గాయకుడు అద్నామ్ సమీ ట్వీట్ చేశారు.

ఇలా ముఖ్యమంత్రిని తప్పుపడుతూ గాయకుడు చేసిన ట్వీట్ పట్ల మంత్రి విడదల రజిని ట్విట్టర్లో గట్టిగా స్పందించారు. ట్విట్టర్లో మరీ అతిగా ఆలోచించడం మానేసి మీరు కూడా భారతదేశానికి ఇలాంటి ఒక గొప్ప అవార్డును తీసుకురండి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఒకరు తమ మూలాలను గౌరవించుకోవడం వేర్పాటువాదం కిందకు రాదు అన్న విషయాన్ని గుర్తించాలని గాయకుడికి ట్విట్టర్లో మంత్రి ర‌జిని సమాధానం ఇచ్చారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా కౌంటర్ ఇచ్చారు. తమ భాష, తమ సంస్కృతి తమకు ఎప్పటికీ గర్వకారణమే అన్నారు. తెలుగువారిగా గర్వించడం అన్నది భారతదేశం నుంచి వేరు కావడం కానే కాదన్నారు. తమ దేశభక్తిపై మీరు తీర్పులివ్వాల్సిన అవసరం లేదని గాయకుడు పై గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు.

గాయకుడు సమీ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. సమీ 2016కు ముందు వరకు అసలు భారత పౌరుడే కాదని విజయసాయిరెడ్డి చెప్పారు. తెలుగు ప్రజలకు దేశభక్తి అన్నది సహజ గుణమని.. వేరొకరి సర్టిఫికెట్లు తమకు అవసరం లేదన్నారు.

Tags:    
Advertisement

Similar News