రామోజీ ఉక్కిరిబిక్కిరి

మార్గదర్శిపై సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖలు మాత్రమే దాడులు చేసి కేసులు పెట్టి విచారణ చేస్తున్నాయి. ఇక నుండి వీటికి అదనంగా రెగ్యులర్ పోలీసు, ఫైర్ సేఫ్టీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా దాడులు చేయబోతున్నారట.

Advertisement
Update: 2023-08-17 06:16 GMT

ప్రభుత్వంపై బురదచల్లటమే టార్గెట్‌గా ఎల్లో మీడియా వార్తలు, కథనాల జోరు పెంచుతోంది. ఈ క్రమంలో ప్రతిరోజూ అడ్డదిడ్డమైన రాత‌ల‌తో ప్రభుత్వాన్ని గబ్బుపట్టించే ప్రయత్నం చేస్తోంది. దీన్ని ఎదుర్కోవటానికి అన్నట్లుగా ఎల్లో మీడియా ఆర్థిక మూలాలనే దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మార్గదర్శి చిట్ ఫండ్స్ పై కేసులు. ఛైర్మన్‌గా రామోజీరావు, ఎండీ ఆయన కోడలు శైలజపైనా కేసులు పెట్టి విచారణ జరుపుతోంది. ఇప్పుడు ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే వరుసబెట్టి మార్గదర్శి ఆఫీసులపై దాడులు చేసి రామోజీని ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యిందట.

ఇప్పటివరకు మార్గదర్శిపై సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖలు మాత్రమే దాడులు చేసి కేసులు పెట్టి విచారణ చేస్తున్నాయి. ఇక నుండి వీటికి అదనంగా రెగ్యులర్ పోలీసు, ఫైర్ సేఫ్టీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా దాడులు చేయబోతున్నారట. రాష్ట్రంలో మార్గదర్శికి 37 బ్రాంచిలున్నాయి. ఇవన్నీ చాలావరకు ప్రైవేటు భవనాల్లోనే ఉన్నాయి. ఆ భవనాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అని ఇప్పుడు చూడబోతున్నారట. నిబంధనల ప్రకారం లేని భవనాలకు వెంటనే తాళాలు వేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యిందని సమాచారం.

సంస్థ‌పై దాడులు ఎలా చేయాలి? దాడులు చేసినప్పుడు ఏ ఏ అంశాలను తనిఖీలు చేయాలి? వంటి అనేక అంశాలపై సీఐడీ ఉన్నతాధికారులు బుధవారం ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారట. ఈ వర్క్ షాపుకు సుమారు 100 మంది అధికారులు హాజరైనట్లు సమాచారం. బహుశా దాడులను అన్నీశాఖలు గురువారం నుండే మొదలుపెట్టే అవకాశాలున్నాయి.

ఇక్కడ విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి-రామోజీరావు నువ్వా-నేనా తేల్చుకుందాం అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఇక ఆ స్థాయికి వెళ్ళినపుడు ఒకరినొక‌రు దెబ్బతీసుకోవటానికి అందుబాటులో ఉన్న అన్నీ అవకాశాలను ఉపయోగించుకోవటం సహజం. ఈ ఎపిసోడ్ మొత్తం మీద రామోజీయే అనవసరంగా జగన్‌ను కెలుక్కున్నారు. రామోజీ అద్దాల మేడలో ఉంటూ బయట ఉన్న‌ జగన్‌పై రాళ్ళు విసిరారు. కొద్దిరోజులు ఆ రాళ్ళని తట్టుకున్నా తర్వాత లాభం లేదని జగన్ బండలు విసరటం మొదలుపెట్టారు. దాని పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్నదంతా. సీఐడీ నోటీసులను కూడా రామోజీ, శైలజ లెక్కచేయటంలేదు. మరి దీని పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News