సింహంలా సింగిల్ గానే పోరాడుతా- జగన్

రాష్ట్రంలోని తోడేళ్లన్నీ తనకు వ్యతిరేకంగా ఒకటయ్యాయని జగన్‌ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నది క్యాస్ట్‌ వార్‌ కాదని.. క్లాస్ వార్ అని జగన్ వ్యాఖ్యానించారు.

Advertisement
Update: 2023-01-30 07:42 GMT

తోడేళ్లన్నీ ఏకమైనా తాను సింహంలా సింగిల్‌గానే వస్తానని చెప్పారు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి. పల్నాడు జిల్లా వినుకొండలో జగనన్న చేదోడు మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. బటన్‌ నొక్కి నిధులు విడుదల చేశారు. అక్కడే బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.

జీఎస్డీపీ వృద్ధిరేటులో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేని వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. పేద ప్రజలకు నేరుగా రూ. లక్షా 92 వేల కోట్ల రూపాయలను అందించామన్నారు. '' మీ బిడ్డ అంటే గిట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అవుతోందని ప్రచారం చేస్తున్నారని.. అదే నిజమైతే దేశానికే దిక్సూచిగా మీ బిడ్డ హయాంలో రాష్ట్రం ముందుకు ఎలా పరుగులు తీస్తోంది?'' అన్న విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు.

రాష్ట్రంలోని తోడేళ్లన్నీ తనకు వ్యతిరేకంగా ఒకటయ్యాయని జగన్‌ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నది క్యాస్ట్‌ వార్‌ కాదని.. క్లాస్ వార్ అని జగన్ వ్యాఖ్యానించారు. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య యుద్ధం నడుస్తోందన్నారు. గత ముఖ్యమంత్రి ముసలాయన పాలనలో గజదొంగల ముఠా దోచుకుందని విమర్శించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడు ఒక ముఠాగా మారారన్నారు.

ఆ ముసలాయనకు ఉన్నట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు త‌న‌కు తోడుగా ఉండకపోయినా, తన కోసం దత్తపుత్రుడు మైక్ పట్టుకోకపోయినా ఏమీ కాదని.. తాను వారిలా కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నమ్ముకున్నానని జగన్ చెప్పారు. ఈ తోడెళ్లన్నీ ఏకమైనా సరే తాను సింహంలా సింగిల్‌గానే పోరాడుతానని జగన్ ప్రకటించారు. తమకు ఎవరితోనూ పొత్తులుండవని ప్రకటించారు. మీ బిడ్డ నేరుగా బటన్‌ నొక్కుతుంటే నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వచ్చి పడుతున్నాయని.. గతంలో ఇలా ఎందుకు లేదో గజదొంగల ముఠాను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News