ఏపీలో 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్..

పోర్టు నిర్మాణానికి భూసేకరణలో సహకరించిన గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోర్టు, దాని అనుబంధంగా ఏర్పడే పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. తొలి దశలో 4 బెర్త్ లు నిర్మిస్తున్నామని, దాని కోసం 3740 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు.

Advertisement
Update: 2022-07-20 09:27 GMT

ఏపీలో 50కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్..ఏపీలోని కోస్తా తీరంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్ వచ్చే విధంగా ప్రణాళిక రచిస్తున్నట్టు తెలిపారు సీఎం జగన్. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్ట్ కి భూమిపూజ చేసిన ఆయన రామాయపట్నం పోర్ట్ నిర్మాణంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలోని 6 పోర్ట్ లకు అదనంగా మరో 4 పోర్ట్ లు(భావనపాడు, కాకినాడ గేట్ వే, మచిలీపట్నం, రామాయపట్నం) ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీటితోపాటు 9 ఫిషింగ్ హార్బర్లు ఉంటాయని.. మొత్తంగా ఏపీలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్, లేదా ఫిషింగ్ హార్బర్ ఉండేలా చేస్తామని హామీ ఇచ్చారు.

పోర్టు నిర్మాణానికి భూసేకరణలో సహకరించిన గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోర్టు, దాని అనుబంధంగా ఏర్పడే పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. తొలి దశలో 4 బెర్త్ లు నిర్మిస్తున్నామని, దాని కోసం 3740 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. 25 మిలియన్ టన్నుల కార్గో రవాణాకు అవకాశముంటుందని అన్నారు జగన్. పోర్ట్ కి అనుసంధానంగా పారిశ్రామకి కారిడార్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పనులేవీ చేయకుండా.. హడావిడిగా ఎన్నికలకు 2 నెలల ముందు రామాయపట్నం వచ్చి చంద్రబాబు టెంకాయ కొట్టి, శంకుస్థాపన అనే పేరుతో ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు జగన్. ఇంతకంటే అన్యాయం ఉందా, మోసం ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ అంటూ రైతుల్ని, అక్క చెల్లెళ్ల‌ను మోసం చేశారని, ఉద్యోగాలంటూ యువతని మోసం చేశారని మండిపడ్డారు. గతంలోనే తాము శంకుస్థాపన చేసిన పోర్ట్ కి ఇప్పుడు జగన్ భూమిపూజ ఏంటంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణల్ని ఆయన తిప్పి కొట్టారు. రామాయపట్నం పోర్ట్ కి 850 ఎకరాలు భూసేకరణ చేసి డీపీఆర్ తో పనులు మొదలు పెట్టామని వివరణ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News