ఏపీ అసెంబ్లీలో ఈరోజు 9 బిల్లులు

ఈరోజు ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలు జరుగుతాయి. మహిళా సాధికారతకోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి అసెంబ్లీలో చర్చిస్తారు.

Advertisement
Update: 2023-09-25 02:56 GMT

ప్రతిపక్షమే లేకుండా పోయిన ఏపీ అసెంబ్లీలో ఈరోజు ప్రభుత్వం 9 బిల్లులు ప్రవేశపెట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ బిల్లు-2023, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లు-2023, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్లు-2023, ఆంధ్రప్రదేశ్ భూదాన్ అండ్ గ్రామ దాన్ సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతుంది. ఈ బిల్లులతోపాటు బుడగ జంగం సామాజిక వర్గాన్ని ఎస్సీలలో కలిపేందుకు కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం.

స్వల్పకాలిక చర్చ..

ఈరోజు ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలు జరుగుతాయి. మహిళా సాధికారతకోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి అసెంబ్లీలో చర్చిస్తారు. అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ, సమగ్ర భూ సర్వే, చుక్కల భూముల్లో సంస్కరణలు వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతుంది.

ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలు..

ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో మూడోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. రైతు రుణాలు, 9,10వ షెడ్యూల్‌ లో ఆస్తులు, తూర్పు కాపులకు బీసీ సర్టిఫికెట్ల మంజూరు, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు, ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్‌లు, విద్యా దీవెన, వసతి దీవెన వంటి అంశాలపై ప్రశ్నోత్తరాలను చేపడతారు. ప్రతిపక్ష టీడీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించడంతో శనివారం మధ్యాహ్నం నుంచి సమావేశాలు ప్రశాంతంగా సాగాయి. ఈరోజు కూడా ప్రతిపక్షం లేని సమావేశాలు సజావుగా ముగుస్తాయి. 

Tags:    
Advertisement

Similar News