కాపు ఓట్ల చుట్టూ ఏపీ రాజకీయం..

పవన్ అయినా, చంద్రబాబు అయినా, జగన్ అయినా.. ఆయా కులాల ఓట్లు వారికి గుంపగుత్తగా పడిపోతాయా అంటే అనుమానమే. కనీసం ఆ కులం ఓట్లు ఆయా అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేస్తాయా అంటే అది కూడా అనుమానమే.

Advertisement
Update: 2022-08-18 02:26 GMT

``అది కాపు జనసేన కాదు, కమ్మ జనసేన.. కాపులంతా పవన్ సీఎం కావాలనుకుంటే, పవన్ మాత్రం చంద్రబాబు సీఎం కావాలనుకుంటున్నారు.. కాపులను చిత్రహింసలు పెట్టిన చంద్రబాబుకి పవన్ వత్తాసు పలకడమేంటి..? కాపులంతా పవన్ వెంట ఉన్నారని అనుకోవడం ఆయన భ్రమ..``

ఇవీ కొన్నిరోజులుగా ఏపీలో కలకలం రేపుతున్న రాజకీయ వ్యాఖ్యలు. మంత్రులు అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, అమర్నాథ్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. ఇలా కొంతమంది ఓ ప్రణాళిక ప్రకారం పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేశారు. కాపు ఓట్లు పవన్ కి వెళ్లే ప్రసక్తే లేదని, దానికి ప్రధాన కారణం చంద్రబాబుకి ఆయన మద్దతివ్వడమేనంటున్నారు. అసలు పవన్ కల్యాణ్ సొంతంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగలరా లేదా అని ప్రశ్నిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయలేని పవన్ సీఎం ఎలా అవుతారని, కేవలం చంద్రబాబు కోసమే బాబు తాపత్రయ పడుతున్నారని, బాబుని సీఎం చేసేందుకు కాపులు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నిస్తున్నారు.

కాపు ఓట్లు గుంపగుత్తగా పడిపోతాయా..?

పవన్ అయినా, చంద్రబాబు అయినా, జగన్ అయినా.. ఆయా కులాల ఓట్లు వారికి గుంపగుత్తగా పడిపోతాయా అంటే అనుమానమే. కనీసం ఆ కులం ఓట్లు ఆయా అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేస్తాయా అంటే అది కూడా అనుమానమే. కానీ కులం ఓట్లు చెక్కుచెదరకుండా ఉండాలంటే ఏదో ఒక అలజడి రేగాలి. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. 2014, 2019 ఎన్నికల్లో కాపు రిజర్వేషన్ల విషయం ఏపీలో బాగా హైలైట్ అయ్యింది. రిజర్వేషన్లు ఇవ్వలేనని తేల్చి చెప్పారు జగన్. ఇస్తానని చెప్పి మాట తప్పారు బాబు. ఇప్పుడు రిజర్వేషన్ల అంశం పూర్తిగా మరుగునపడిపోయింది. పోనీ పవన్ ఏమైనా ఉద్ధరిస్తారా అనుకుంటే.. ఆయన ఎప్పుడు ఏగట్టున ఉంటారో ఆయనకే తెలియదంటున్నారు. ఈ క్రమంలో కాపు ఓట్లకోసం అటు జ‌న‌సేన‌, ఇటు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ఓట్ల రాజకీయంలోకి కులం వచ్చి చేరింది.

"ఇలా చెప్పడానికి నాకు బాధగా ఉంది, ఆంధ్రా భావన ఎలాగూ లేదు, కనీసం కుల భావన అయినా తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి" అంటూ ఆమధ్య ఓ మీటింగ్ లో పవన్ కల్యాణ్ చెప్పారు. రాజకీయాలు కులమతాలకు అతీతం అని ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వస్తున్న పవన్.. ఇప్పుడు ఓ స్టాండ్ తీసుకున్నాడని అర్థమవుతోంది. పవన్ ఓపెన్ అయిపోయారు కాబట్టి, వైసీపీ కూడా తన ఆపరేషన్ మొదలు పెట్టింది. పవన్ ని టార్గెట్ చేసింది. పవన్, చంద్రబాబు మనిషని, జనసేనకు ఓట్లు వేస్తే అవి చంద్రబాబుకి వేసినట్టేనని, కాపులంతా కలసి మళ్లీ కమ్మవారికి పెత్తనం అప్పగించడమేంటనే లాజిక్ తీస్తున్నారు వైసీపీ మంత్రులు. అందుకే జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికి కాపు ఓట్ల చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News