మళ్లీ తెరపైకి అమరావతి ఉద్యమం.. ప్రతిపక్ష నేతల మద్దతు

రాజధాని ప్రాంత రైతుల ఉద్యమంలో న్యాయముందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ధర్మం వారివైపే ఉందని, అమరావతే గెలుస్తుందని చెప్పారు.

Advertisement
Update: 2023-03-31 09:32 GMT

అమరావతి ఉద్యమం 1200 రోజులకి చేరుకున్న సందర్భంగా ప్రతిపక్ష పార్టీలన్నీ అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. మందడంలోని శిబిరానికి చేరుకున్న నేతలు రైతులకు మద్దతు తెలిపారు. ‘దగా పడ్డ రైతులు, దోపిడీకి గురవుతున్న ఆంధ్రా పౌరులు’ అనే పేరుతో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాల నేతలు పాల్గొన్నారు.

వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అమరావతి ఆందోళనలో పాల్గొన్నారు. అమరావతి నుంచి ఒక్క మట్టిపెళ్ల కూడా వైసీపీ ప్రభుత్వం కదిలించలేదని మండిపడ్డారాయన. వచ్చే ఎన్నికల్లో అమరావతి వ్యతిరేక శక్తులు కొట్టుకుపోతాయని వ్యాఖ్యానించారు. అమరావతి 29 గ్రామాలది మాత్రమే కాదని, ప్రపంచంలోని కోట్లాది తెలుగువారిదని అన్నారు. అమరావతి అప్పుడు ముద్దు, ఇప్పుడెందుకు కాదో జగనే చెప్పాలన్నారు. జగన్‌ అమరావతికి జైకొడితే ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారన్నారు. ప్రధాని మోదీ చెబితే అమరావతి నుంచి రాజధాని కదిలే అవకాశం లేదన్నారు కోటంరెడ్డి.

మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పిన జగన్‌, అధికారంలోకి వచ్చాక రాజధాని విషయంలో మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. సీఎం జగన్ కు ప్రజల గోడు పట్టదని, ఆయన ధ్యాసంతా ఆదాయంపైనే అని అన్నారు. వైసీపీ నేతల భూకబ్జాలకు ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలన్నీ బూటకం అని విమర్శించారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా అమరావతి ఉద్యమం ఆగలేదని అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఉద్యమం ఇది అని చెప్పారు. రాజధాని అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లినా జగన్‌ కు ఊరట లభించడం లేదన్నారు. పోలీసుల అండ లేకుండా అమరావతిలో సీఎం జగన్ తిరగలేకపోతున్నారని చెప్పారు. అమరావతి ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఉందని అన్నారు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. జగన్‌ విక్రమార్కుడు కాదని, 'విక్రయ'మార్కుడంటూ సెటైర్లు పేల్చారు.

రాజధాని ప్రాంత రైతుల ఉద్యమంలో న్యాయముందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ధర్మం వారివైపే ఉందని, అమరావతే గెలుస్తుందని చెప్పారు. రాజధాని రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా రైతుల పోరాట స్ఫూర్తిని చంద్రబాబు అభినందించారు. ప్రభుత్వ ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి అమరావతి ఉద్యమం ముందుకు సాగుతోందన్నారు. అంతిమంగా గెలిచేది.. నిలిచేది అమరావతేనని పేర్కొన్నారు. 



Tags:    
Advertisement

Similar News